ఇన్‌చార్జి కలెక్టర్‌గాసంచిత్ గంగ్వార్
నారాయణపేట: జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 11 వరకు లాంగ్ లీవ్ పెట్టడంతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు అప్పగిస్తూ సీఎస్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సమయానికి మధ్యాహ్న భోజనం అందించాలి
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సమయం ప్రకారం అందించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మార్కెట్ లైన్ పాఠశాలలో గురువారం ఆలస్యంగా భోజనం అందించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను, వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. చాలామంది విద్యార్థులు ఉదయం తినకుండా పాఠశాలలకు వస్తుంటారని, మధ్యాహ్న భోజనం ఆలస్యం కావడంతో వారికి మరింత ఇబ్బంది కలుగుతుందన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకునేందుకు వస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేయడం లేదని, వెంటనే డిపో మేనేజర్ తన తీరు మార్చుకొని పాఠశాలల సమయానికి అనుకూలంగా బస్సులను నడపాలని డిమాండ్ చేశారు.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,819
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,819, కనిష్టంగా రూ.2,291 ధరలు లభించాయి. అదేవిధంగా హంస గరిష్టంగా రూ.1,916, కనిష్టంగా రూ.1,911, కందులు రూ.6,221, వేరుశనగ గరిష్టంగా రూ.8,118, కనిష్టంగా రూ.7,141, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,914, కనిష్టంగా రూ.1,810, పత్తి గరిష్టంగా రూ.6,601, కనిష్టంగా రూ.5,570 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,609, కనిష్టంగా రూ.2,426గా ధరలు లభించాయి.


