ప్రాజెక్టులపై నజర్ | - | Sakshi
Sakshi News home page

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో కదలిక

Sep 25 2024 12:44 AM | Updated on Sep 25 2024 6:15 PM

ఏదుల రిజర్వాయర్‌

ఏదుల రిజర్వాయర్‌

గట్టు, బీమా ఎత్తిపోతలను పూర్తిస్థాయిలో వినియోగానికి చర్యలు

నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర, జూపల్లి పర్యటన 

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. కృష్ణానదిపై ఉన్న గట్టు, బీమా ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్‌ పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించేందుకు సన్నాహాలను ప్రారంభించింది. 

ఇందులో భాగంగా బుధవారం రాష్ట్ర సాగునీటి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, ఉమ్మడి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. 

ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ప్రాజెక్టుల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తెలుసుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల పెండింగ్‌ పనుల పురోగతిపై ఆశలు నెలకొన్నాయి.

వివిధ దశల్లో   'పాలమూరు' పనులు..

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కింద చేపట్టిన పనులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తికావచ్చింది. అయితే పంపుహౌజ్‌ల్లో మోటార్ల బిగింపు, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నార్లాపూర్‌ వద్ద తొమ్మిది మోటార్లను బిగించాల్సి ఉండగా, వీటిలో నాలుగు మోటార్లను బిగించారు. వీటిలో ఒక మోటారు ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. మిగతా మోటార్ల బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏదులలో పంప్‌హౌజ్‌లో పది మోటార్లకు ఐదు, వట్టెంలో పదికి గానూ నాలుగు మోటార్ల బిగింపు పూర్తయింది. మరో మోటారు బిగింపు ప్రక్రియ కొనసాగుతుండగానే ఇటీవల వట్టెం పంప్‌హౌజ్‌లోని మోటార్లు వరదనీటిలో మునిగిపోయాయి. వీటి పరిస్థితి ఏంటదన్నది తేలాల్సి ఉంది. నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు పూర్తిస్థాయిలో మెయిన్‌ కెనాల్‌, టన్నెల్‌ పనులను పూర్తిచేయాల్సి ఉంది. కొల్లాపూర్‌ మండలం కుడికిళ్ల సమీపంలో మెయిన్‌ కెనాల్‌ కాల్వ పనులకు భూసేకరణ పూర్తికావడంతో పెండింగ్‌ పనులకు మార్గం సుగుమమైంది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల ప్రస్తుత పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించున్నారు. ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి సీఎం రేవంత్‌రెడ్డికి నివేదికను అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement