నారాయణపేట రూరల్: టీశాట్ నెట్‌వర్క్ (నిపుణ చానల్) ద్వారా శనివారం ఇన్‌స్పైర్ అవార్డ్స్ 2024–25కు సంబందించి హైద్రాబాద్ నుంచి లైవ్‌లో డీఎస్సీ కమీషనర్ నర్సింహారెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్లు రమేష్, సురేష్‌బాబు ఇంటరాక్టివ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి జిల్లాలోని వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, గణితం, సైన్స్ టీచర్లు, విద్యార్థులు ప్రొజెక్టర్‌లో వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని యాజమాన్య పాఠశాలల్లోని యూపీఎస్, హైస్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఒక్కో పాఠశాల నుంచి గరిష్టంగా ఐదు నామినేషన్లు నమోదు చేసుకోవచ్చని, ప్రతీ నామినేషన్ ఆన్‌లైన్‌లో సూచించిన వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ఎంపికై న ప్రతీ నామినేషన్‌కు రూ.10వేలు చొప్పున విద్యార్థి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు. అకౌంట్ తప్పనిసరిగా జాతీయ బ్యాంకు, పోస్టాపీసులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ భానుప్రకాష్ టీచర్లు పాల్గొన్నారు.