సంస్కరణల పేరుతో సతాయింపు! | - | Sakshi
Sakshi News home page

సంస్కరణల పేరుతో సతాయింపు!

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

నేటి నుంచి ఇంటర్‌

సెకండియర్‌ తరగతులు

ఇంటర్మీడియెట్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల

నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తరగతులు

6 నుంచి 23వ తేదీ వరకు

ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు

పది పరీక్షల ఫలితాలు రాకముందే అడ్మిషన్లు

కార్పొరేట్‌ కాలేజీల కోసమేనంటున్న విద్యార్థి సంఘాలు

కర్నూలు సిటీ: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతుండడంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దోచి పెట్టేందుకు పూనుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూన్‌ మొదలయ్యే అకడమిక్‌ ఇయర్‌ను మార్పు చేసి ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు గతేడాది నుంచి చర్యలు చేపట్టింది. దీనికి సంస్కరణలు అనే సాకు చూపుతుండడం గమనార్హం. విద్యా వ్యవస్థల్లో మార్పుల కంటే అయిన వారి విద్యాసంస్థల కోసమే సెలవుల్లో తరగతులను ప్రారంభిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు 2026–27 అకడమిక్‌ ఇయర్‌ను ప్రారంభించి సెకండ్‌ ఇయర్‌ తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను జారీ చేశారు. ఈ ప్రకారం 314 రోజులు, 82 సెలవు దినాలు, 232 పని దినాలు ఉన్నాయి. ఈ నెల ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ఇంటర్మీడియెట్‌ థీయరీ పరీక్షల మూల్యాంకనం జరుగనుంది. ఇలాంటి సమయంలో బోర్డు జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నుంచే తరగతులను ప్రారంభించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం సైతం అమలు చేయనున్నారు. అధ్యాపకులు లేకుండా అకడమిక్‌ ఇయర్‌ను ఎలా ప్రారంభిస్తున్నారు? వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు కాలేజీకి హాజరవుతారో? లేదోనని అధ్యాపకులు వాపోతున్నారు.

6 నుంచి ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లు

ఇంటర్మీడియేట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు ఏప్రిల్‌ 6 నుంచి 23వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకునేందుకు షెడ్యుల్‌ జారీ చేశారు. ఈ నెల 2వ తేదీ పదో తరగతి పరీక్ష జరుగనుంది. మూల్యాంకనం 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆ తరువాత సుమారుగా 20 రోజుల తరువాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితాలు రాకముందే ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వడం బట్టి చూస్తే కార్పొరేట్‌, సెమీ కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు ఏటా షెడ్యుల్‌ కంటే ముందుగా అడ్మిషన్లు చేసుకోవడంపై జరిగే ఆందోళనలు లేకుండా వారికి పరోక్షంగా సాయం చేసేందుకే ప్రభుత్వం ముందస్తు అడ్మిషన్లకు అనుమతులు ఇచ్చినట్లు పలు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పుస్తకాలు లేకుండా తరగతులు?

ఇంటర్మీడియెట్‌ బోర్డు తీసుకొచ్చిన నూతన సంస్కరణల ప్రకారం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు, జూన్‌ 1వ తేదీ నుంచి కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు, ఆ తరువాత డొక్కా సీతమ్మ మధ్యాహ్నా భోజన పథకం ద్వారా భోజనం అందించేలా ఆదేశాలు ఇచ్చాం.

– జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి

జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన జూనియర్‌ కాలేజీలు 161 ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ విద్యలో కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా బుధ వారం నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 23వ తేదీ వరకు తరగతులు నిర్వహించి, 24వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్‌ 1న కాలేజీలు తెరవనున్నారు. ఏప్రిల్‌ 1 నాటికే విద్యార్థుల చేతికి నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఒక్క నోటు బుక్కు కానీ, పాఠ్య పుస్తకం కానీ రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement