బేతంచెర్ల: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో మంగళవారం మధ్యా హ్నం దొంగతనం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ తెలిపిన వివరాల మేరకు.. పాతరెడ్డి హోటల్ ఎదురు వీధిలో నివసించే విష్ణుమోహన్ భార్య మద్దాల పరిమళ ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చాడు. ఆమె మరిది సత్యబాబు అడ్రస్ కావాలంటూ మాటల్లో దించి ఒక్కసారిగా పరిమళ మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కున్నాడు. అనంతరం ఆమెను గదిలో వేసి బయట గొళ్లెం పెట్టి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి గొళ్లెం తీయడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరగడంతో ఒంటరిగా ఉండే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
నందికొట్కూరు రూరల్: మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో వేదావతి అలియాస్ నీలమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఎస్‌ఐ మణికంఠ తెలిపిన వివరాలు.. నీలమ్మకు చిన్నతనంలో తల్లి చనిపోవడంతో కోడుమూరు నియోజకవర్గంలోని ప్యాలకుర్తి గ్రామానికి చెందిన మేనమామ శ్రీనివాసులు పెంచి పెద్ద చేశారు. గత ఫిబ్రవరిలో 10 బొల్లవరం గ్రామానికి చెందిన వెంకటరాముడుకు ఇచ్చి వివాహం చేశారు. ఇదిలాఉండగా నీలమ్మ నానమ్మ లింగమ్మ సోమవారం చనిపోయింది. దీన్ని జీర్ణించుకోలేక ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై మేనమామ భార్య సుబ్బలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాళ్ల పారాణి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండాయా? అంటూ బంధువులు రోధించిన తీరు అక్కడివారిని కంటితడి పెట్టించింది.
డోన్ టౌన్: పట్టణంలోని శ్రీనివాస నగర్‌లో ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల్లో ఒకరు స్థానికులకు పట్టుబడ్డారు. సోమ వారం రాత్రి దుండగులు చైన్‌స్నాచింగ్‌కు యత్నించగా మహిళ అప్రమత్తమై కేకలు వేసింది. నిందితులు మోటార్ సైకిల్‌పై పారిపోవడానికి ప్రయత్నించగా కాలనీ ప్రజలు వెంబడించి ఒక యువకుడిని పట్టుకున్నారు. నిందితుడిని పట్టణ పోలీసులకు అప్పజెప్పారు. పట్టుబడిన యువకుడు కర్నూలు పట్టణం బుధవారపేటకు చెందిన అబ్దుల్ కరీంగా పోలీసుల విచారణలో తెలిసింది. పరారైన ముగ్గురు నిందితులపై గతంలో బండిఆత్మకూర్, నంద్యాల, పాణ్యం, నందికోట్కూ రు, కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పట్టుబడిన అబ్దుల్ కరీంపై తెలంగాణ రాష్ట్రం గద్వాల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసులకు అప్పజెప్పి, పరారైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ ఇంతియాజ్‌బాషా వెల్లడించారు.


