కాయ్ రాజా కాయ్..!
బేతంచెర్ల: తెలుగు తమ్ముళ్లు అక్రమ సంపాదనకు బడి, గుడిని కూడా వదలడం లేదు. కొందరు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటుండగా.. మరి కొందరు దర్జాగా పేదలను దోచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా జేబులు ఖాళీ చేసి పంపిస్తున్న వైనం చూస్తే నివ్వెరపోవాల్సిందే. స్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులను క్షేత్ర పరిసరాల్లో మాటు వేసిన జూద నిర్వాహకులు సర్వం దోచుకుని పంపుతున్నారు. జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు దర్జాగా జూదం (బిళ్ల ఆట) నిర్వహిస్తున్నారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ వార్డు కౌన్సిలర్ అండతో యువకులు జూదం నిర్వహిస్తూ భక్తుల జేబులను గుళ్ల చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి శుక్ర, శనివారాలతో పాటు పర్వదినాలలో స్వామి వారి దర్శనార్థం భక్తులు చేరుకుంటారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్లో కొందరిని ఆశ పెడుతూ జూదం ముగ్గులోకి దింపుతున్నారు. ఆలయ పరిధిలోని గోశాల, ముఖ ద్వారం, మెట్ల మార్గం వద్ద రాత్రి వేళ, వేకువజామున జూదం ఆడిస్తున్నారు. గత నెల 29వ తేదీన 130 రూము వద్ద రూ. లక్షలలో జూదం ఆడి డబ్బులు పొగొట్టుకున్న వ్యక్తులు జూదం నిర్వహకులతో గొడవకు దిగినట్లు సమాచారం. క్షేత్ర పరిధిలో ఇంత తతంగం జరుగుతున్నా ఆలయ ఉప కమిషనర్, పోలీసులు చూసీ చూడన్నట్లు వ్యహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయ విశిష్టతకు భంగం వాటిల్లకుండా, ఇలాంటి జూదం ఆడకుండా దేవదాయశాఖ, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి తోడు అప్పుడప్పుడూ సెల్ ఫోను దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
మద్దిలేటయ్య క్షేత్రంలో
జోరుగా జూదం
బేతంచెర్ల వార్డు కౌన్సిలర్ అండతో
నిర్వహణ
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న
ఆలయ అధికారులు, పోలీసులు


