మహానందీశ్వరుడి సేవలో..
మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే పోలీస్ ఫోర్స్ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్ పూజలు నిర్వహించారు. శుక్ర వారం మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్‌కు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి
బండి ఆత్మకూరు: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ప్రేమంత్ కుమార్ అన్నారు. శుక్రవారం పార్నపల్లిలోని ప్రభాత్ విద్యా సంస్థలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించారు. జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారిణి నాగ సువర్చల అధ్యక్షతన ఈ పోటీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 65 పాఠశాలల నుంచి పది వేర్వేరు ట్రేడ్లలో 300 వినూత్న ప్రాజెక్టులు వచ్చాయి. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటి వాటిని ప్రదర్శించారు. ప్రతి ట్రేడ్ నుంచి ఒక ఉత్తమ ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామని ప్రేమంత్ కుమార్ తెలిపారు. ఈ నెల 14న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సుందర్‌రావు, నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
విష జ్వరంతో విద్యార్థిని మృతి
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె మోడల్ ప్రైమరీ పాఠశాల విద్యార్థిని విష జ్వరం బారిన పడి కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన తలారి రాజు, రామాంజినమ్మ దంపతులు కూలీ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె పద్మిని(10) గ్రామంలోని పాఠశాలలో నాల్గో తరగతి చదువుతోంది. వారం రోజుల నుంచి జ్వరం రావడంతో పలు చోట్ల ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. తగ్గక పోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని సూచించారు. అప్పటికే రూ.60 వేల మేర వైద్యానికి ఖర్చు చేశారు. ఆర్థిక స్థోమత లేక పోవడంతో కూతురిని అనంతపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. చివరకు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. పద్మిని చదువులో చురుగ్గా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థిని మృతికి సంతాపంగా మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు సెలవు ప్రకటించారు.
ఉరుకుంద హుండీ ఆదాయం రూ. 1.37కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలోని హుండీల్లో భక్తులు రెండు నెలలపాటు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నగదు రూపంలో రూ.1,37,79,215 సమర్పించినట్లు ఆలయ డిప్యూటి కమిషనర్ వాణి తెలిపారు. అలాగే వెండి 18 కేజీల 990 గ్రాములు, బంగారం 6 గ్రాముల 750 మిల్లీగ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదోని గ్రేడ్–1 కార్యనిర్వహణాధికారి రాంప్రసాద్, దేవాలయ సిబ్బంది, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి పాల్గొన్నారు.
వచ్చే ఐదు రోజుల్లో పొడి వాతావరణం
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఎలాంటి వర్షసూచన లేదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉష్ణోగ్రతలు 33.2 డిగ్రీల నుంచి 33.4 డిగ్రీల వరకు నమోదు కావచ్చన్నారు. నవంబర్ నెల మొదటి వారంలో 13 మి.మీ వర్షపాతం నమోదైంది.
మహానందీశ్వరుడి సేవలో..
మహానందీశ్వరుడి సేవలో..


