12న ఆర్‌యూ కాన్వొకేషన్
● హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్,
వర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ 4వ కాన్వొకేషన్ కార్యక్రమాన్ని ఈనెల 12న వర్సిటీలో నిర్వహిస్తున్నట్లు వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు వెల్లడించారు. శుక్రవారం వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ హాజరవుతారన్నారు. ఎ.ఎం. గ్రీన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్.ఎస్.వి.రామకుమార్‌కు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ఆయనే ప్రధాన వక్తగా ఉపన్యసిస్తారన్నారు. స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న బంగారు పతక విజేతలు, పరిశోధన విద్యార్థులు కాన్వొకేషన్‌కు ఒక రోజు ముందు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నుంచి ఎంట్రీ పాసులు పొందాలని సూచించారు. విద్యార్థితో పాటు మరొకరికి మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. మిగిలిన విద్యార్థుల కోసం కాన్వొకేషన్ రోజు ఉదయం 8 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని.. 10 గంటల సమయంలోపు కాన్వొకేషన్ హాల్‌లో సిద్ధంగా ఉండాలన్నారు. 283 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 889 మందికి పీజీ పట్టాలు, 17,224 మందికి డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల పట్టాలు ప్రదానం చేస్తామన్నారు. 60 మంది పీజీ, 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ బి.విజయ్ కుమార్ నాయుడు, వర్సిటీ వైస్‌ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.నరసింహులు, సీడీసీ డీన్ ఆచార్య పి.వి. సుందరానంద్, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య ఆర్.భరత్ కుమార్, రీసెర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


