
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓలు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంపై అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు. జిల్లాలో రెవె న్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ మేరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతి రోజూ తహసీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం ముగ్గురు సహాయకులను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో 326 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.