
ఇంటి వద్ద రేషన్ పంపిణీ బంద్
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పెంచలమ్మ. శిరివెళ్లకు మజరా గ్రామమైన వెంకటేశ్వరపురంలో నివాసం ఉంటున్నారు. రేషన్ బండి రాకపోతే గతంలో లాగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే శిరివెళ్లకు వెళ్లాలని ఈమె చెబుతున్నారు. వృద్ధాప్యంలో కాలినడకన ఎలా వెళ్లి తెచ్చుగోలనని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● ఎండీయూ వ్యవస్థను
రద్దు చేసిన ప్రభుత్వం
● 1 నుంచి రేషన్ దుకాణాల
వద్దనే పంపిణీ
● కిలోమీటర్లు నడిచి వెళ్లి రేషన్
తెచ్చుకోవాల్సిన దుస్థితి
● ఆందోళనలో 5,41,804 మంది
రేషన్ కార్డుదారులు
● రోడ్డున పడనున్న 702 మంది
ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు
ఆళ్లగడ్డ: రేషన్ కార్డుదారులకు ఐదేళ్లు దూరమైన రేషన్ కష్టాలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. ఇంటివద్దకే వచ్చి రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జూన్ 1 నుంచి పాత పద్ధతిలో రేషన్ దుకాణాలవద్దనే సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇక మీదట రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే తండాలు, గూడేలతో పాటు శివారు కాలనీల వాసులు రాళ్లు రప్పలు దాటుకుంటూ ఎంతదూరమైనా దుకాణం దగ్గరకు వెళ్లాల్సిందే.
రోడ్డున పడనున్న ఆపరేటర్లు, హెల్పర్లు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2021లో ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలో 351 ఎండీయూ వాహనాలు ఉండగా 351 మంది ఆపరేటర్లు, 351 మంది హెల్పర్లను నియమించారు. ఒక్కో వాహనానికి నెలకు రూ. 21 వేలు అందిస్తున్నారు. రెండు, మూడు దుకాణాల పరిధిలో కార్డుదారులకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యావసరాలను అందిస్తూ వచ్చారు. అనేక మంది ఆపరేటర్లు, హెల్పర్లు దీన్నే జీవనాధరంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల నిలిపివేస్తే 702 కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతుంది. వీరి జీవనాధారం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తారని భావించి ఓటేసి అధికారం కట్టబెడితే తమ కడుపులు కొట్టడం భావ్యం కాదని ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నారు.
2027 వరకు ఒప్పందం
ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఎండీయూ నిర్వాహకులకు 2027 వరకు ఒప్పందం ఉంది. వాహనాల కంతులు సైతం అప్పటివరకూ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఎండీయూ వాహనం ధర రూ 5.80 లక్షలు కాగా అందులో 10 శాతం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా.. మిగిలింది ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇందుకు గాను ఎండీయూ నిర్వాహకుడు రూ. 3 వేలు చెల్లిస్తుండగా మిగిలిన రూ. 8 వేలు ప్రభుత్వం ప్రభుత్వం నెలలా చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకాన్ని రద్దు చేస్తే ఈ ఒప్పందాన్ని ఏం చేస్తారని చర్చించుకుంటున్నారు.
జిల్లాలోని తెల్ల రేషన్
కార్డులు 5,41,804
ప్రతి నెలా కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం7,600 టన్నులు
జిల్లాలోని రేషన్
దుకాణాలు 1,204
ఎండీయూ హెల్పర్లు 351
ఎండీయూ ఆపరేటర్లు 351
ఎండీయూ వాహనాలు 351

ఇంటి వద్ద రేషన్ పంపిణీ బంద్