
బెస్తలకు రాజకీయగుర్తింపు ఇవ్వాలి
కర్నూలు(అర్బన్): బెస్తలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని అఖిల భారత బెస్త మహాసభ రాష్ట్ర కోకన్వీనర్ టి.సాయిప్రదీప్ కోరారు. బుధవారం స్థానిక బిర్లా కాంపౌండ్ సమీపంలోని డాక్టర్ బ్రాహ్మారెడ్డి ప్రజా వైద్యశాల సమావేశ భవనంలో బెస్త ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ముందుగా భగవాన్ శ్రీ వ్యాస మహర్శి చిత్ర పటానికి నేతలు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిప్రదీప్ మాట్లాడుతూ బెస్తలు రాజకీయ పదవులకు నోచుకోవడం లేదన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన రాజ్యాంగపరమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు కోల్పోయినా, కనీసం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్లోనూ బెస్తలకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. త్వరలో ప్రకటించనున్న మార్కెట్‌యార్డు, దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ఇతర పదవుల్లో బెస్తలను నియమించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు భాస్కర్‌రావు, ఉదయ్, పీజీ వెంకటేష్, ఆనంద్‌రాజు, జయన్న, ఎద్దుల వెంకటేశ్వర్లు, గ్యాస్ శ్రీనివాసులు పాల్గొన్నారు.