
సీఐపై దాడి కేసులో ఏడుగురికి జైలు, జరిమానా
కర్నూలు: స్థానిక బంగారుపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల తొలగింపు సమయంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ పార్థసారధిరెడ్డిపై దాడి చేసిన ఏడుగురు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దివాకర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 2021 నవంబర్ 30న అక్రమ కట్టడాలను తొలగించేందుకు బందోబస్తుగా అప్పటి రెండో పట్టణ సీఐ పార్థసారధిరెడ్డి, కోడుమూరు సీఐ శ్రీధర్ సిబ్బందితో బంగారుపేటలోకి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో జేసీబీతో ఆక్రమణలు తొలగిస్తుండగా కొంతమంది రాళ్లతో పోలీసులపై దాడి చేయగా సీఐకి గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స అనంతరం టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. బంగారుపేటకు చెందిన లక్ష్మి, నీలిషికారి బెల్కీ, ఎన్.నరసింహులు, నీలిషికారి సుగుణ, ప్రసాద్, నీలి షికారి నాగమణి, నీలిషికారి బెగినిలపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో
కర్నూలు (టౌన్): ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పోను మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నట్లు క్రెడాయ్ కర్నూలు చైర్మన్ గోరంట్ల రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితా, బొగ్గు ల దస్తగిరి, కలెక్టర్ పి.రంజిత్‌బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మేయర్ బీవై.రామ య్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొంటారన్నారు. ప్రాపర్టీ షోలో 60 మంది బిల్డ ర్లు, నిర్మాణ వస్తువుల సరఫరాదారులు, ఇంటీరియర్ డిజైనర్లు పాల్గొంటారన్నారు. ప్రధాన స్పాన్సర్‌గా రాగమయూరి బిల్డర్స్, కో స్పాన్సర్‌గా స్కందాన్షి ఇన్ ఫ్రా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఆటో పెవిలియన్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, క్రెడాయ్ కన్వీనర్ ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి టీఏవీ ప్రకాష్, ఇతర క్రెడాయ్ సభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు.