
వర్షానికి కూలిన బ్రిడ్జి
కల్లూరు: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని గంజివాగు బ్రిడ్జి కూలిపోయింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతోపాటు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లక్ష్మిపురం గ్రామంలోని గంజివాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రైతులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గ్రామంలో పర్యటించారు. గంజివాగుపై కూలిన బ్రిడ్జితోపాటు గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు.