
వడ్ల వ్యాపారిపై కేసు నమోదు
అవుకు: నకిలీ రశీదులు సృష్టించి లారీలను చెక్‌పోస్టులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్న వడ్ల వ్యాపారిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపిన వివరాలు.. అవుకు పట్టణానికి చెందిన వడ్ల వ్యాపారి సాయి ఈనెల 5న రాత్రి 10 గంటలకు వరి బస్తాల లోడ్ లారీని అవుకు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా బేతంచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టు వద్ద మార్కెట్ కమిటీ అసిస్టెంట్ తనిఖీ చేశారు. కడప జిల్లా కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి బిల్లు చెల్లించినట్లు ఉన్న రశీదులను లారీ డ్రైవర్ చూపించాడు. అసిస్టెంట్‌కు రశీదులపై అనుమానం వచ్చింది. లారీ డ్రైవర్ మార్కెట్ కమిటీ అసిస్టెంట్‌కు సుపరిచితుడు కావడంతో విషయాన్ని ఆరా తీశారు. దీంతో నకిలీ రశీదులని తెలియడంతో వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. బిల్లులు ఎవరిచ్చారని డ్రైవర్‌ను విచారించగా అవుకు గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి సాయి ఇచ్చినట్లు చెప్పడంతో బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి అవుకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దీంతో సాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు.