
ఐదుగురితో విచారణ కమిటీ ఏర్పాటు
ఆత్మకూరు అటవీడివిజన్‌లో ఒక సామాన్య టైపిస్టుగా దినసరి వేతనంతో చేరిన చాంద్‌బాషా అంచెలంచెలుగా డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతులు పొందుతూ చివరకు ఆఫీస్ సూపరింటెండెంట్‌గా రిటైరయ్యారు. ఈయన సర్వీస్ చివరి 15 సంవత్సరాలు ఆత్మకూరు అటవీ డివిజన్ ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి తదితర ప్రాంతాలకు బదిలీ అయినా డిప్యూటేషన్‌పై ఇక్కడే పని చేయడంతో పైఅధికారులకు విషయం తెలియకుండా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసుకోవడానికి అవకాశం లభించినట్లు సమాచారం. అక్రమాలు వెలుగు చూడటంతో ఒక ఐఎఫ్‌ఎస్ అధికారితో దర్యాప్తు చేయించి రిపోర్టు ఉన్నతాధికారులకు పంపిన తరువాతే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట రూ.20లక్షలు ఖాతాలు మారినట్లు పేర్కొన్న అధికారులు ఆతరువాత ఇంకొంత నిశితంగా రికార్డుల పరిశీలన చేసి రూ.కోట్లలో అవినీతి జరిగిందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సహాయ కన్జర్వేటర్ సాయిబాబా అటవీదళాల ప్రధానాధికారి పీసీసీఎఫ్ ఏకే నాయక్‌కు సమగ్ర నివేదికను పంపారు. ఈ మేరకు ఆయన ఐదుగురితో కూడిన ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. ఆధారాల సేకరణ అనంతరం కేసును సీఐడీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సమగ్ర నివేదిక అందజేశాం
ఆత్మకూరు అటవీడివిజన్ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్‌గా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చాంద్‌బాషా అక్రమాలపై అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదికను అందజేశాం. ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాకు మళ్లించడంతో ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అక్రమాలు రూ. కోట్లలో ఉండటంతో ఐదుగురి సభ్యులతో విచారణ కమిటీ దర్యాప్తు చేపడుతోంది. – వి. సాయిబాబా, ప్రాజెక్ట్ టైగర్,
డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు