
● గోరుకల్లు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల బృందం
పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వ
పాణ్యం: గోరుకల్లు జలాశయం పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వకు అవకాశం ఉంటుందని నిపుణుల బృందం సభ్యులు అధికారులకు సూచించారు. జలాశయం కట్ట కుంగిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యు లు సందర్శించారు. కమిటీలోని సీడీఓ సీఈ విజయభాస్కర్, సీఈ కబీర్‌బాషా, ఎస్‌ఈ శివకుమార్‌రెడ్డి, ఈఈ మనోహరెడ్డి, సుభకుమార్, డీఈలు రీనా, కేధారేశ్వరరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ప్రసూనాదేవి తదితరులు జలాశయాన్ని సందర్శించారు. ముందుగా డ్యామ్ డిజైన్, కట్ట కుంగిన ప్రాంతం, జారుతున్న రాతిపరుపు, లీకేజీలు తదితర అంశాలను పరిశీలించారు. ఒకే చోట కట్ట కుంగడంపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కట్ట కుంగిన చోటా ఎత్తు 259 మీటర్లు మాత్రమే ఉందని, 265.06 మీటర్లు ఎత్తు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కట్ట పూర్తి స్థాయిలో నిర్మించి కాంక్రీట్ చానెళ్లు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు కట్టలోకి వెళ్లకుండా నేరుగా జలాశయంలోకి వెళ్తుందన్నారు. భూమి లోపల పొరల వల్ల కూడా కట్ట కుంగే ప్రమాదం ఉందన్నారు. కట్టలోని 7 ప్యానెళ్లలో రాతి పరుపు దెబ్బతిన్నట్లు గుర్తించి లూస్ సాయిల్‌ను తొలగించాలన్నారు. కొత్తగా కంకర, ఇసుకతో ఫిల్ చేసి కట్టను పటిష్టం చేయాలని సూచించారు. జలాశయంలో పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వారి వెంట డీఈఈలు జ్యోతి, గీతా, శివప్రసాద్, ఏఈలు, జేఈఈలు పాల్గొన్నారు.