
జెడ్పీలో అల్లూరికి ఘన నివాళి
కర్నూలు(అర్బన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు నిబద్ధత, త్యాగం ఉంటే ఎలాంటి అణచివేతనైనా ఎదుర్కోగలమని జిల్లా పరిషత్ సీఈఓ జి. నాసరరెడ్డి అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయస్సులోనే వీర మరణం పొందారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి బ్రిటీష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌డీఓ అనురాధ, జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సి. మురళీమోహన్‌రెడ్డి, రాంగోపాల్, జితేంద్ర, సరస్వతమ్మ, పుల్లయ్య, బసవశేఖర్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.