
దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి
కోడుమూరు రూరల్: మండలంలోని పులకుర్తి గ్రామంలో ఈనెల 26న జరిగిన దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నడిపి రంగన్న (38) ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. దీంతో పులకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నడిపి రంగన్న అదే గ్రామానికి చెందిన మునిస్వామిల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న నిందితుడు మునిస్వామి, బజారి, మరికొద్ది మంది అనుచరులతో కలిసి నడిపి రంగన్నను, అతని అల్లుడు సురేష్ విషయంపై మాట్లాడేందుకంటూ పిలిపించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నడిపి రంగన్నతో గొడవ పెట్టుకుని రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై సృహలేకుండా పడిపోవడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే రంగన్న మృతిచెందినట్లు చెప్పారు. మునిస్వామి అతని అనుచరులు కొట్టిన దెబ్బల వల్లే రంగన్న మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్‌ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మృతుడికి భార్య మల్లీశ్వరీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా విషయం తెలుసుకున్న కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి సోమవారం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రంగన్న మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నడిపి రంగన్న మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కోడుమూరు జెడ్పీటీసీ సభ్యులు రఘునాథ్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచు ప్రవీణ్‌కుమార్, స్థానిక నాయకులు రవికుమార్‌రెడ్డి, లింగమూర్తి, జగదీష్ ఉన్నారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కోట్ల హర్ష

దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి