కనిపించని టీడీపీ బంద్‌ ప్రభావం | - | Sakshi
Sakshi News home page

కనిపించని టీడీపీ బంద్‌ ప్రభావం

Sep 12 2023 2:08 AM | Updated on Sep 12 2023 12:06 PM

- - Sakshi

సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్‌ నేపథ్యంలో సోమవారం ఆ పార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. అయితే జిల్లా కేంద్రంతో పాటు ఏడు నియోజకవర్గాల్లోనూ ఎక్కడా బంద్‌ ప్రభావం కన్పించలేదు. రోజులాగే యథావిధిగా జనజీవనం సాగింది. ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు బంద్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్ణీత సమయానికే వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరిచారు. చివరకు సొంతపార్టీ నేతలు, కార్యకర్తలు కూడా బంద్‌ చేసేందుకు రోడ్డుపైకి రాకపోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత రిమాండ్‌, టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో జైలుకు వెళ్లిన తొలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఈ నేపథ్యంలో బంద్‌కు స్పందన వస్తుందని టీడీపీ అధిష్టానం భావించింది. మరోవైపు జనసేన, బీజేపీ, సీపీఐలు కూడా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా ప్రకటనలు ఇచ్చారు. దీంతో ఈ పార్టీలన్నీ కలిసి వస్తాయని, బంద్‌ విజయవంతం అవుతుందని భావించారు. అయితే మిగిలిన పార్టీల సంగతి పక్కనపెడితే టీడీపీ కార్యకర్తలు కూడా రోడ్డెక్కలేదు. జిల్లా ప్రజలు కూడా టీడీపీ స్పందన చూసి నివ్వెరపోయారు. అక్కడక్కడా కొందరు చోటా నాయకులు రోడ్డుపైకి వచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చి సరిపెట్టి వెళ్లారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లబ్ధి పొందినవారు, జన్మభూమి కమిటీల సభ్యులు, పార్టీకి చెందిన చోటా మోటా నేతలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపైకి వచ్చి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఇది మినహా బంద్‌ వాతావరణమే లేకపోయింది. సీపీఐ, జనసేన, ఎమ్మార్పీఎస్‌ నేతలు బంద్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ వారు కూడా రోడ్డుపై కన్పించలేదు. బహుశా ప్రజలకు మేలు చేయడంలో భాగంగా బంద్‌కు పిలుపునివ్వకపోవడం, ప్రజల సొమ్మును స్వాహా చేసిన అవినీతి కేసులో జైలుకు వెళ్లడంతో ప్రజల నుంచి కూడా మద్దతు కరువైంది.

సాఫీగా ప్రజా రవాణా..
తెలుగు దేశం పార్టీ బంద్‌ ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో జిల్లాలో ప్రజా రవాణా సాఫీగా సాగింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు యథావిధిగా కొనసాగాయి. పట్టణాల్లో ఆటోలు కూడా తిరగడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నంద్యాలలో తెల్లవారుజాము నుంచి యథావిధిగా ఆర్టీసీ బస్సులు నడిచాయి. ఒక్క బస్సు సర్వీసును కూడా ఆర్టీసీ అధికారులు రద్దు చేయలేదు. జిల్లాలోని మిగతా డిపోల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రయాణకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీసులు కొనసాగించారు. కోవెలకుంట్ల, ఆత్మకూరు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు ఆర్టీసీ డిపోల వద్ద కూడా బంద్‌ ప్రభావం కన్పించలేదు.

► జిల్లా కేంద్రం నంద్యాలలో వ్యాపార సముదాయాలు, అన్ని కార్యాలయాలు యథావిధిగా కొనసాగాయి. టీడీపీ నేత భూమా బ్రహ్మానందరెడ్డి, అనుచరులు ఉదయం తన అనుచరులతో కలిసి ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా డీఎస్పీ మహేశ్వరరెడ్డి తన సిబ్బందితో కలిసి అరెస్ట్‌ చేసి టూటౌన్‌ స్టేషన్‌కు తరలించారు.

► డోన్‌ నియోజకవర్గ పరిధిలో బంద్‌ ఏమాత్రం కనిపించ లేదు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ధర్మారం సుబ్బారెడ్డి, నాయకులను ముందస్తుగానే అదుపులోకి తీసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లమీద కనిపించ లేదు.

► శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలు కాస్త హడావుడి వేసి ప్రధాన రహదారిపై టైర్లు వేసి నిప్పంటించగా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలలో బంద్‌ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు.

► ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో శిరివెళ్ల, చాగల మర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, రుద్రవరం, ఆళ్లగడ్డ మండలాల్లో బంద్‌ ప్రభావం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement