రేపే మలి విడత పంచాయతీ పోలింగ్
ప్రలోభాల జోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ డివిజన్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారంతో ప్రచార పర్వం ముగియడంతో అంతటా అభ్యర్థులు, వారికి మద్దతు తెలిపే పార్టీల నేతలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అధికార కాంగ్రెస్ మద్దతుదారులతోపాటు ప్రతి పక్ష బీఆర్‌ఎస్, ఇతర పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు పోటాపోటీగా ఖర్చు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈనెల 11న నల్లగొండ, చండూరు డివిజన్లలో మొదటి విడత ఎన్నికలు పూర్తికాగా, 14న మిర్యాలగూడ డివిజన్‌లో జరుగునున్నాయి. అవసరమైన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. కేంద్రాలకు పోలింగ్ సామగ్రిని శనివారం పంపిణీ చేయనుంది.
ఏర్పాట్లలో అధికార యంత్రాంగం
ఎన్నికలు జరిగే మిర్యాలగూడ డివిజన్‌లోని గ్రామాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ర్యాండమైజేషన్‌ను పూర్తిచేశారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ కేంద్రాల నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బంది బ్యాలెట్, పోలింగ్ సామాగ్రితో పాటు పోలింగ్ బాక్సులను తీసుకోనున్నారు. వారికి ఏర్పాటు చేసిన వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు శనివారం తరలి వెళ్లనున్నారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్
ఆదివారం 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 1 గంటలోపు పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లున్నా వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేస్తారు. చివరకు సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు.
అంతటా పోలీస్ బందోబస్తు
పది మండలాల పరిధిలో జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా అధిక సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం మధ్యాహ్నం వరకు జోరుగా సాగిన ప్రచారం సాయంత్రం బంద్ అయింది. గ్రామాల్లో ర్యాలీలు, ప్రచారాలతో గోలగోలగా ఉండగా ప్రచారం ముగియడంతో గ్రామాలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఈ 36 గంటలే కీలకం కావడంతో అధికార, ప్రతిపక్ష, ఇతర అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ప్రచారాలతో ఒక్కో కుటుంబాన్ని పలుమార్లు కలిసిన పోటీదారులు ఇప్పుడు ఓటర్లను తమవైపు తిప్పుకునే కార్యాచరణకు దిగినట్లు సమాచారం. అనేక చోట్ల మద్యం పంపిణీ కొనసాగుతుండగా డబ్బు పంపిణీపైనా దృష్టిపెట్టారు. మరోవైపు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవిస్తున్న ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వచ్చిపోయే కిరాయిలతోపాటు వారికి మర్యాద చేస్తామని చెప్పి పోలింగ్ రోజు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సర్పంచ్, అటు వార్డు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు.
ఫ శుక్రవారంతో ముగిసిన ప్రచారం
ఫ పది మండలాలు, 244 గ్రామాల్లో ఎన్నికలు
ఫ సాయంత్రం వరకు ఫలితాల వెల్లడి
ఫ మిర్యాలగూడ డివిజన్‌లో ఏర్పాట్లు పూర్తి


