బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
నల్లగొండ: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. నల్లగొండలోని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ర్యాండమైజేషన్‌లో వారు మాట్లాడారు. ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని 2,418 పోలింగ్ కేంద్రాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. 2,898 మంది ప్రీసైడింగ్ అధికారులు, 3,334 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు అవసరమన్నారు. ఇందుకు 2,418 బృందాలను ఏర్పాటు చేస్తూ ర్యాండమైజేషన్ చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఈఓ భిక్షపతి, ఈడీఎం దుర్గారావు, ఎన్‌ఐసీ అధికారి ప్రేమ్, అబ్జర్వర్ నోడల్ ఆఫీసర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ పాల్గొన్నారు.
ఉపకార వేతనాల పంపణీలో
జాప్యం చేయొద్దు
నల్లగొండ: ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో జాప్యం చేయకుండా వేగంగా అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల పంపిణీపై శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపకార వేతనాల దరఖాస్తులపై సమీక్ష, ధ్రువీకరణ, ఫండ్ విడుదల అన్నింటినీ నిర్దిష్ట గడువుల్లోనే పూర్తిచేయాలన్నారు. తహసీల్దార్లు త్వరగా విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలన్నారు. అన్ని మండలాల్లో స్కాలర్‌షిప్‌ల దరఖాస్తులను వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్. జె.శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శశికళ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, ఎంఈఓలు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు, లీడ్ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి, కలెక్టర్ ఇలా త్రిపాఠి


