పలువురు జడ్జిల బదిలీ
నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు శుక్రవారం బదిలీ అయ్యారు. నల్లగొండ జిల్లా కోర్టు మూడవ అదనపు జడ్జి డి.దుర్గాప్రసాద్ నిజామాబాద్‌కు, మిర్యాలగూడ కోర్టు ఐదవ అదనపు జడ్జి జి.వేణు సికింద్రాబాద్కు, సీనియర్ సివిల్ జడ్జి బి.సుజయ్ హైదరాబాద్ కోర్టుకు బదిలీ అయ్యారు. ఖమ్మం జిల్లా కోర్టులో పనిచేస్తున్న కెవి.చంద్రశేఖరరావు మిర్యాలగూడ కోర్టుకు, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం.రాధాకృష్ణచౌహన్ సూర్యాపేట కోర్టు మొదటి అదనపు జడ్జిగా బదిలీ అయ్యారు.
కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్ తనిఖీ
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్ శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లో రిసెప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎస్‌హెచ్‌ఓ రూమ్‌తో పాటు స్టేషన్ పరిసరాలను, సిబ్బంది కిట్లను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. ఆయన వెంట ఏఎస్పీ మౌనిక, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ రమేష్ తదితరులున్నారు.
కొబ్బరికాయల వేలం వాయిదా
నార్కట్‌పల్లి : మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే కొబ్బరికాయ టెండర్ వేలం ఈ సంవత్సరం నాలుగోసారి వాయిదా పడింది. 2025 –2026 సంవత్సరానికి గాను టెండర్‌ను ప్రభుత్వం రూ.53 లక్షల 26 వేలుగా నిర్ణయించింది. డీపీఓ వెంకటయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నాలుగోసారి వేలంపాట నిర్వహించారు. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిక్కుల శివ రూ.33 లక్షల 50 వేలకు పాట పాడాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రాక పోవడంతో మళ్లీ వాయిదా వేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీఓ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, మాజీ సర్పంచ్ సాగర్ల సైదులు, మాజీ ఉపసర్పంచ్ వడ్డె భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ అనిత, వెంకన్న పాల్గొన్నారు.
ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని వినతి
ఎల్లారెడ్డిగూడెం నుంచి చెర్వుగట్టుకు వెళ్లే ఆర్చికి ఇరువైపులా కొబ్బరికాయలు విక్రయించేందుకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అధికారులకు విన్నవించారు. ప్రత్యేక స్థలం కేటాయించకుండా టెండర్ అధికంగా పెడుతున్నారని పేర్కొన్నారు.
సాగర్ రెండు గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శుక్రవారం ఎగువనుంచి వరద పెరగడంతో.. రెండు రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా కృష్ణానదిలోకి నీటిని వదులుతున్నారు. సాగర్ జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 590 (312.0450టీఎంసీలు) అడుగులుగా ఉంది. ఎగువనుంచి 67,471 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 34,104 క్యూసెక్కులు, మొత్తం 50,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శుక్రవారం మూసీకి 4,132 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు మూడు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 3,917 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 24 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 645 (4.46 టీఎంసీలు) అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో 644 (4.18 టీఎంసీలు) అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు విడువల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
పలువురు జడ్జిల బదిలీ
పలువురు జడ్జిల బదిలీ


