ఉల్లాస్ పథకం త్వరలో జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. గ్రామస్థాయిలో వీఓఏలు నిరక్షరాస్యులను గుర్తించి వివరాలను ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశారు. ఎంపిక చేసిన వలంటీర్లు.. నిరక్షరాస్యులకు చదువు నేర్పించే బాధ్యత వహిస్తారు. స్థానిక ఉపాధ్యాయులు కూడా పాఠాలు చెప్పేందుకు సహకరిస్తారు.
– ఎం.శ్రీనాథ్, ఉల్లాస్ పథకం జిల్లా కోఆర్డినేటర్
రామగిరి(నల్లగొండ) : మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రభుత్వం ఉల్లాస్ పథకాన్ని తీసుకొచ్చింది. 2022 – 23 విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించింది. రాష్ట్రంలో 2025–26 నుంచి ఈ పథకాన్ని ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యుల్లో 15 సంవత్సరాల పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి ప్రత్యేక విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్షరాస్యత పెంపుతో పాటు జీవన నైపుణ్యాలు, మహిళల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు, వయోజన విద్య, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను భాగస్వాములుగా చేర్చారు.
61,179 మంది నిరక్షరాస్య మహిళల గుర్తింపు
జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయ సంఘాల్లో 61,179 మంది నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించారు. సంఘాల్లో చదువు వచ్చిన మహిళను వలంటీర్‌గా ఎంపిక చేశారు. 10 మంది మహిళలు ఒక వలంటీర్‌ను కేటాయిస్తారు. ఇప్పటికే 6,118 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వలంటీర్లకు మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 10వ తేదీ వరకు ఈ శిక్షణ పూర్తి కానుంది. బోధన కోసం 16 అంశాలతో కూడిన అక్షర వికాసం అనే పుస్తకాన్ని రూపొందించారు. శిక్షణ పొందిన వలంటీర్ రోజూ రెండు గంటల బోధన చేయాలి. చదవడం, రాయడం, సంఖ్యాశాస్త్రం నేర్పించడం, ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. డిజిటల్ నైపుణ్యాలు కూడా నేర్పిస్తారు. గామంలో సామాజిక చైతన్య కేంద్రంలో వీరికి బోధన చేస్తారు. ఈ పుస్తకాన్ని 200 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంది.
ఫ మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ‘ఉల్లాస్’ అమలు
ఫ జిల్లాలో 61 వేల నిరాక్షురాస్య మహిళల గుర్తింపు
ఫ వలంటీర్ల ద్వారా విద్యా బోధన
అతివకు అక్షరాలు


