
ఉరి కంబానికి తలొగ్గని పోరు బిడ్డలు
మిర్యాలగూడ: సాయుధ పోరు సాగిస్తున్న సమయంలో ఉమ్మడి జిల్లాలోని అక్కినేపల్లి, షాబ్దుల్లాపురం గ్రామాల్లో జరిగిన హత్య కేసులో జిల్లాకు చెందిన 12 మందికి ఉరి శిక్ష పడింది. అది ‘తెలంగాణ 12’గా అంతర్జాతీయంగా సంచలనం రేపింది. హైదరాబాద్ గవర్నర్ ప్రత్యేక ట్రిబ్యూనల్ వీళ్ల కేసుపై విచారించింది. సైనిక గవర్నర్ ఆదేశాల మేరకు నల్లగొండలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ట్రిబ్యూనల్‌లో 1949 ఏప్రిల్ 7న నమోదైన క్రిమినల్ కేసుల్లో 1949 ఆగస్టు 13, 14న ఇచ్చిన తీర్పుతో 12 మందికి మరణశిక్ష విధించారు. ఇందులో నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి, దోమల జనార్దన్‌రెడ్డి, గార్లపాటి రఘుపతిరెడ్డి, దూదిపాల చినసత్తిరెడ్డి, మేరా హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణరెడ్డి, వడ్ల మల్లయ్య, ఎర్రబోతు రాంరెడ్డి, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరి ఉన్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రాకముందే ఉరిశిక్ష అమలు చేసేందుకు యత్నించారు. ఈ వార్త జాతీయ, అంతర్జాతీయంగా ప్రచారమైంది. లండన్ నుంచి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ లాయర్స్ అధ్యక్షుడు డీఎన్. ప్రిట్, బొంబాయ్ నుంచి డేనియల్ లతీఫ్, గణేష్ షాన్‌బాగ్ వంటి న్యాయవాదులు హైదరాబాద్‌కు చేరుకుని అప్పటి స్థానిక న్యాయవాది మనోహర్‌లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్ష ఆపే ప్రయత్నం మొదలుపెట్టారు. అంతర్జాతీయ సంస్థలు వారి మరణశిక్షలు రద్దు చేయాలని అప్పటి ప్రధాని నెహ్రూను విజ్ఞప్తి చేశాయి. హైదరాబాద్ స్టేట్ హైకోర్టు ఇచ్చిన ఈ మరణశిక్షల తీర్పును భారత సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ అది వీగిపోయింది. అంతర్జాతీయ న్యాయవాది డీఎన్.ప్రిట్ స్వయంగా కేసు చేపట్టడం వల్ల విదేశీ విలేకరులు, రాయబారుల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ వారి మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరు 6 నుంచి 8 సంవత్సరాలు శిక్షలు అనుభవించి 1956లో కొందరు, 1958లో మరికొందరు విడుదల అయ్యారు. తెలంగాణ చరిత్రలో అతి ముఖ్యమైన ఈ ఉదంతానికి తగిన ప్రాముఖ్యత దక్కలేదు.