సాక్షి, యాదాద్రి : సింగపూర్, ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణాపురంలోని అమేయ కృషి వికాస కేంద్రాన్ని సందర్శించారు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న క్యాన్సర్ నివారణకు ఫిలిప్పిన్స్‌లో ఉపయోగిస్తున్న 3సి క్యారెట్ కుకుంబర్ సేలరీ ద్రావణం ద్వారా తాము సాధించిన ఫలితాలను వివరించి 3సీ ద్రావణం తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. అమేయ కృషి వికాస కేంద్రం రూపొందించిన ఆగ్రో హోమియోపతిని గురించి ‘అమేయ’ నిర్వాహకుడు జిట్టా బాల్‌రెడ్డి వివరించారు. తాము రూపొందించిన పోషక ఎరువుల, పేడ ద్రావణం వినియోగంలో వస్తున్న ఫలితాలను వివరించారు. జాడంతో పాటుగా ఆగ్రో హోమియోపతి మరింత అందుబాటులోకి తెచ్చి కృషి సమష్టిగా కొనసాగిద్దామని విదేశీ శాస్త్రవేత్తల బృందం, అమేయ కృషి వికాస కేంద్రం ప్రతినిధులు బాల్‌రెడ్డి, జ్యోతిరెడ్డి పరస్పర అంగీకారానికి వచ్చారు.