
కుక్కల దత్తత అభినందనీయం
నల్లగొండ: హైదరాబాద్ తరహాలో నల్లగొండలో కుక్కల దత్తత కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని రాంనగర్ పార్కులో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కుక్కల సంతతి పెరగకుండా స్టెరిలైజేషన్ చేస్తూనే కుక్కలను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. కుక్కలకు వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కుక్కలను దత్తత తీసుకున్న వారిని ఆయన అభినందించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇటీవల వీధి కుక్కలు, కోతులు, పిల్లుల సంఖ్య పెరిగిపోయి వాటి దాడులు పెరిగాయన్నారు. వాటిని నివారించేందుకే కుక్కల దత్తత, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కుక్క కాటుకు గురైన వారు రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. నల్లగొండలో 92 వేల గృహాలు ఉన్నాయని సుమారు 5 వేల కుక్కలు ఉన్నాయని, ఒకొక్కరు ఒక్కో కుక్కను దత్తత తీసుకుంటే కుక్కల బెడద ఉండదన్నారు. ఈ సందర్భంగా 49 కుక్కలను దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీఎఫ్‌ఓ రాజశేఖర్, దేవరకొండ ఏసీపీ మౌనిక, అదనపు ఎస్పీ రమేష్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, పశు సంవర్థక శాఖ అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ నల్లగొండలో కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ ప్రారంభం