
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు అధికంగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ముఖ మండపం, ప్రసాద విక్రయశాల, ఇతర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు అధికంగా రావడంతో ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.42,32,003 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
నృసింహుడి సన్నిధిలో విశేష పూజలు..
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. సాయంత్రం జోడు సేవలను మాడ వీధిలో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
40వేలకు పైగా దర్శించుకున్న భక్తులు
ధర్మ దర్శనానికి 3గంటలకు
పైగా సమయం