
ఉత్తమ బోధనకు కేరాఫ్.. కేజీబీవీ
ఫ ఇంగ్లిష్ మీడియంలో బోధన.. సకల వసతులు
ఫ ఆరో తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం
ఫ జిల్లాలో 27 విద్యాలయాలు
కేతేపల్లి : పేద, వెనుకబడిన, మద్యలో బడిమానేసిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను నెలకొల్పింది. తల్లిదండ్రులు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనేదే వీటి లక్ష్యం. ఈ విద్యాలయాల్లో ప్రవేశం పొందిన వారికి ఉత్తమ బోధనతోపాటు క్రమశిక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సొంత భవనాల్లో ఉచిత వసతితో పాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించటం ఈ విద్యాలయాల ప్రత్యేకత. ఆరో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉండటంతో ఈ విద్యాలయాల్లో చేరేందుకు బాలికలు ఆసక్తి చూపుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభించారు.
ప్రతి తరగతిలో 40 మంది..
జిల్లాలో మొత్తం 27 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థినులు ఉంటారు. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అదే విధంగా ఇంటర్మీడియట్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఈసీ కోర్సుల్లో 40 మంది చొప్పున విద్యార్థినులకు ప్రవేశం ఉంటుంది.
భవిష్యత్‌లో ఉపాధి పొందేలా..
కేజీబీవీల్లో విద్యార్థినులకు అన్ని వసతులు కల్పించడం, మెనూ ప్రకారం ఆహారం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందిస్తారు. ఇక్కడ ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో విద్యార్థినులు ఉపాధి పొందేలా కుట్లు, అల్లికలతో పాటు కంప్యూటర్ శిక్షణ, మార్షల్ ఆర్ట్స్‌పై తర్ఫీదు సైతం ఇస్తారు. వివిధ రకాల వృత్తి విద్యా కోర్సులు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి.
ప్రవేశాలు ఇలా..
కేజీబీవీలో ప్రవేశాలకు సంబంధించి మొదట తల్లిదండ్రులు లేని పేద విద్యార్థినులకు ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత మిగిలిన విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల కోసం విద్యార్థినులు 5వ తరగత వరకు చదువుతున్న బోనఫైడ్, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి.