
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
గట్టుప్పల్ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో ఈ నెల 10న చోటు చేసుకోగా.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మకన్నె గ్రామానికి చెందిన వల్ల పు మల్లేష్(37) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మల్లేష్ భార్య హేమలతతో అదే గ్రామానికి చెందిన రేవెల్లి నవీన్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం మల్లేష్‌కు తెలియడంతో హేమలతను మందలించాడు. దీంతో తమ వివాహేతర సంబంధానికి మల్లేష్ అడ్డొస్తున్నాడని అతడిని అంతమొందించాలని అతడి భార్య హేమలత, ఆమె ప్రియుడు నవీన్ నిర్ణయించుకున్నారు.
మద్యం తాగించి..
ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం మల్లేష్ నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో టైల్స్ పెట్టడానికి నవీన్ వచ్చాడు. అనంతరం వారిద్దరు కలిసి గ్రామంలో మద్యం తాగి తమ ఇళ్లకు వెళ్లారు. తిరిగి సాయంత్రం నవీన్ మల్లేష్‌ను పిలిచి ఫుల్లుగా మద్యం తాగించాడు. ఈ విషయాన్ని నవీన్ ఫోన్ ద్వారా హేమలతకు చెప్పాడు. రాత్రి 10.30 గంటలకు మల్లేష్‌ను నవీన్ బైక్‌పై ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో మల్లేష్ మంచంపై నిద్రకు ఉపక్రమించగానే నవీన్, హేమలత కలిసి టవల్‌తో మల్లేష్ ముఖంపై అదిమిపట్టి శ్వాస ఆడకుండా చేసి హతమార్చారు. మరుసటిరోజు తెల్లవారుజామున తన భర్త చనిపోయాడని హేమలత కేకలు వేస్తూ అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి చెప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హేమలతను ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హేమలత, ఆమె ప్రియుడు నవీన్ కలిసి పథకం ప్రకారమే మల్లేష్ హతమార్చినట్లు నిర్ధారణ కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన చండూరు సీఐ ఆదిరెడ్డి, గట్టుప్పల్ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, ఏఎస్‌ఐ ఆర్. అంజయ్య, పోలీస్ సిబ్బంది వి. రమేశ్, సుదర్శన్‌ను జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అభినందించారు.
ప్రియుడితో కలిసి
భర్తను హతమార్చిన భార్య
నిందితుల అరెస్ట్..
రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి