
నకిలీ విత్తనాలపై నజర్
నల్లగొండ అగ్రికల్చర్ : నకిలీ పత్తి విత్తన అమ్మక వ్యాపారులపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలపై కట్టడి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రత్యేక టాస్క్‌పోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో ఎస్పీ, వ్యవసాయ శాఖ అధికారి రెవెన్యూ అధికారి సభ్యులుగా డివిజన్ స్థాయిలో డీఎస్పీ, ఆర్డీఓ, ఏడీఏ సభ్యులుగా, మండల స్థాయిలో ఎస్‌ఐ, తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి సభ్యులుగా కమిటీలను నియమించింది. ఈ కమిటీలు నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి దాడులు నిర్వహించనున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మిన, రవాణా చేసిన వారిపై కేసులను నమోదు చేసి చర్యలు తీసుకోనుంది.
గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు..
జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాటి అమ్మకాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏటా నిఘా పెట్టినా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారులు తమ అమ్మకాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. ఆ విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేసే రైతులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి నకిలీ విత్తనాల ఆటకట్టించేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
విత్తన వ్యాపారుల అండదండలతో..
జిల్లాలోని ప్రధానంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన విత్తన వ్యాపారులు.. దళారులకు అండగా నిలిచి నకిలీ విత్తన వ్యాపారులకు మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది. ఆయా వ్యాపారులు తమ కంపెనీ బ్రాండెడ్ విత్తనాల అమ్మకం పేరుతో నకిలీ విత్తనాలను దళారుల ద్వారా రైతులకు అంటకట్టడంలో భాగస్వాములవుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వ్యాపార సంస్థలే ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టాస్క్‌పోర్స్ కమిటీలు
ఫ విత్తనాల అమ్మకంపై నిరంతరం నిఘా
ఫ రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ సూచన
దళారులను నమ్మి మోసపోవద్దు
దళారుల మాటలు నమ్మి రైతులు రైతులు మోసపోవద్దు. 450 గ్రాముల బ్రాండెడ్ కంపెనీ విత్తన ధర రూ.901 మాత్రమే. దాని కన్నా ఎక్కువ ధర చెల్లించవద్దు. విత్తనాలు కొన్న వెంటనే రశీదు తీసుకోవాలి. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే వ్యవసాయాదికారులకు సమాచారం అందించాలి.
– శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
బ్రాండెడ్ కవర్లలో నింపి..
గ్రామాల్లో ఎరువులు, విత్తనాల వ్యాపారులు ఏజెంట్లను నియమించుకుని నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా దేవరకొండ, నల్లగొండ, మునుగోడు, గుర్రంపోడు, హాలియా తదితర మండలాల్లో ఈ దందా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా బూత్‌నూరు, గద్వాల, ఏపీలోని గుంటూరు, పిడుగురాళ్ల, మాచర్ల తదితర ప్రాంతాల్లోని జిన్నింగ్ మిల్లుల నుంచి లూజ్ విత్తనాలు దళారులు కొనుగోలు చేసి వాటిని రంగురంగుల బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేసి బ్రాండెడ్ విత్తనాల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన జర్మినేషన్ లేని విత్తనాలను కూడా ఆ బ్రాండెడ్ కంపెనీ కవర్లలో ప్యాక్ చేసి రైతులకు అంటగడుతున్నారు. బీటీ 3, గ్‌లైసెల్ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించినా.. ఆ విత్తనాలను కూడా రైతులకు అంటగడుతున్నారు.

నకిలీ విత్తనాలపై నజర్