
మట్టపల్లిలో వైభవంగా తిరుకల్యాణోత్సవం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాన్ని సోమవారం తెల్లవారు జామున వైభవంగా నిర్వహించారు. అర్చకబృందం శ్రీస్వామి అమ్మవార్లకు జీలకర్రబెల్లం, యజ్ఞోపవీతం, తాళిబొట్టు,తలంబ్రాలను సమర్పించి నిండు వైశాఖ పౌర్ణమి వెన్నెలలో కల్యాణతంతు జరిపించారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి, రాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత ఉత్సవమూర్తులను గజ, సింహ, అశ్వ వాహనాలపై అశేషభక్తుల జయజయధ్వానాల నడుమ కల్యాణమండపం వరకు ఊరేగింపుగా తరలించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి యాదాద్రి కలెక్టర్ మంత్రిప్రగడ హనుమంతరావు, ఆలయ ధర్మకర్త నరసింహమూర్తిలు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్‌లు శ్రీస్వామివారికి సమర్పించారు. కాగా ఉదయం ఆలయంలో పంచామృతాభిషేకం అనంతరం కల్యాణమూర్తులకు శ్రీమన్నారాయణమూర్తి అలంకారంలో గరుడవాహన సేవను నిర్వహించారు.