
నెల్లికల్ లిఫ్ట్ పనులను వేగవంతం చేయాలి
మిర్యాలగూడ : నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూసేకరణ పూర్తయినందున బిల్లుల చెల్లింపు, తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డిలతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి భూసేకరణ పేపర్ నోటిఫికేషన్ ఇదివరకే జారీ చేశామని.. దానికి సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిడమనూరు ట్యాంకుకు ఓటీ ద్వారా నీళ్లు నింపేందుకు ప్రణాళిక రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం భూసేకరణతోపాటు రెండు లిఫ్టులకు ఇదివరకే ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తయినందున తదుపరి ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ పనులు, భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, ఇరిగేషన్ ఎస్‌ఈ మల్లికార్జున్, ఈఈ కరుణాకర్, డీఈ కేశవ్ పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి