
మస్తుగా ‘ముందస్తు’ ఆదాయం
ఎర్లీబర్డ్ ద్వారా ఏడు మున్సిపాలిటీల్లో రూ.14.28 కోట్ల పన్ను వసూలు
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీలకు ముందస్తు ఆదాయం భారీగానే వచ్చింది. జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలు ఉండగా నందికొండ మున్సిపాలిటీ మినహయిస్తే మిగతా ఏడు చోట్ల ఐదు శాతం రాయితీపై ప్రజలు రూ.14.28 కోట్ల ఆస్తి పన్ను చెల్లించారు. మున్సిపాలిటీల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈనెల 7వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ కింద 2025–26 ఆర్థిక సంవత్సర ఆస్తి పన్ను చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం రాయితీ కల్పించిన విషయం తెలిసిందే. దాంతో జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆస్తి పన్ను ద్వారా ఆదాయం రాబట్టారు. మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఇద్దరు ఉద్యోగులను పంపించి ఆస్తి పన్ను వసూలు అయ్యే విధంగా దృష్టి సారించి సక్సెస్ అయ్యారు.
రూ. 14.28 కోట్లు వసూలు...
జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 37 రోజుల పాటు ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్లీబర్డ్ కింద ముందస్తు పన్ను వసూలు చేయాలని నిర్ణయించి టార్గెట్ పెట్టుకొని పని చేశారు. కొన్ని మున్సిపాలిటీల్లో సెలవుల రోజుల్లో కూడా ఉద్యోగులు వాణిజ్య భవనాల ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక చొరవ చూపారు. దాంతో వారు పెట్టుకున్న లక్ష్యానికి దగ్గరగా ఏడు మున్సిపాలిటీలు రూ.14.28 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేశాయి.
వార్డు ఆఫీసర్లు రావడంతో...
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు మున్సిపాలిటీల్లో సిబ్బంది లేక నానా తంటాలు పడేవారు. వార్డు ఆఫీసర్ల నియామకంతో మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీరిపోయింది. కొత్తగా వచ్చిన వార్డు ఆపీసర్లను వార్డుకు ఒకరి చొప్పున నియమించారు. వీరంతా వార్డుల్లో ఆస్తి పన్ను ఎక్కువ శాతం వసూలు అయ్యేందుకు చొరవ తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్తి పన్ను వసూలు కోసమే వార్డుల్లో తిరగడంతో పన్ను వసూలు సులభమైంది.
మున్సిపాలిటీల్లో పన్ను డిమాండ్,
ఎర్లీబర్డ్‌లో పన్ను వసూలు (రూ.కోట్లలో..)
మున్సిపాలిటీ భవనాలు డిమాండ్ వసూలు
నల్లగొండ 43,281 17.60 7.45
మిర్యాలగూడ 26,699 22.59 3.22
దేవరకొండ 7234 2.26 0.86
చిట్యాల 3207 1.40 0.42
చండూరు 3685 69.92 0.17
(లక్షలు) (లక్షలు)
హాలియా 5890 2.15 0.66
నకిరేకల్ 9110 7.00 1.50