నిబంధనల ప్రకారం ధాన్యం తేవాలి
మునుగోడు : రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధలన ప్రకారం తీసుకురావాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. శనివారం మండలంలోని కొరటికల్, పలివెల, కిష్టాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులు తీసుకొచ్చే ధాన్యం 17శాతానికి మించి తేమ ఉండకూడదన్నారు. అలాగే ధాన్యంలో ఏమైనా తాలు ఉంటే తూరుపాలపట్టాలన్నారు. నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు పంపించి వారం రోజుల లోపే రైతులకు డబ్బులు అందేలా చొరవచూపాలని ఆదేశించారు. అంతేకాకుండా తూకంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు పరివేక్షించాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం మైశేశ్వర్‌రావు, సీసీలు శ్రీనివాస్, శంకర్, మల్లేశ్వరి, వీఓఏలు, కమిటీ సభ్యులు ఉన్నారు.


