
1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత
నాగార్జునసాగర్: బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని ఈ నెల 12న నాగార్జునసాగర్ సందర్శనకు ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో 1200 నుంచి 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్లీ జోన్–2 ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్ అతిథి గృహం, బుద్ధవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ను 30 నుంచి 40 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ బృందం ముందుగా విజయవిహార్ అతిథి గృహానికి చేరుకుని అక్కడి నుంచి బుద్ధవనం సందర్శనకు వెళ్తారని పేర్కొన్నారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేసి జాతకవనంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. సుమారు మూడున్నర గంటల పాటు మిస్ వరల్డ్ పోటీదారులు సాగర్‌లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా నిరసనలకు దిగి ఈ పర్యటనకు అంతరాయం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐలు సంపత్, వీరబాబు, వీరశేఖర్, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ