విద్యుత్‌శాఖలో ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖలో ఇష్టారాజ్యం

Mar 13 2025 11:32 AM | Updated on Mar 13 2025 11:28 AM

ఏళ్లతరబడి ఒకేచోట తిష్టవేసిన ఉద్యోగులు

బినామీ పేర్లతో కాంట్రాక్టులు.. విధులకు ఎగనామం

ఉన్నతాధికారులనే శాసించే స్థాయిలో వారి తీరు

మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలో వ్యవహారం

మిర్యాలగూడ : విద్యుత్‌ శాఖలో ఉద్యోగుల ఇష్టారాజ్యం సాగుతోంది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తూ.. బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేపడుతూ తమమాట వినని సిబ్బంది, అధికారులను బదిలీ చేయిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ వ్యవహారం మిర్యాలగూడ డివిజన్‌లో యథేచ్ఛగా సాగుతోంది. దీనికి ప్రత్యక్ష ఉధాహరణ మిర్యాలగూడ విద్యుత్‌ డీఈ కార్యాలయంలో అధికారిగా బాధ్యతలు స్వీకరించి వారెవరూ కనీసం ఏడాది కూడా పనిచేయకుండానే బదిలీపై వెళ్తున్నారు. తాజాగా ఆరు నెలలు కూడా గడవక ముందే డీఈ శ్రీనివాససుధీర్‌కుమార్‌ను ఉన్నతాధికారులు యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీ చేశారు. ఇలాంటి పరిస్థితి మిర్యాలగూడ డివిజన్‌లోనే ఉంది. దీంతో విజిలెన్స్‌ అధికారులు ఈ కార్యాలయంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం.

అధికారుల బదిలీలు ఇలా..

2022 మార్చిలో ఏసీబీ దాడులతో డీఈ మురళీధర్‌రెడ్డిపై వేటుపడింది. అదే సమయంలో దేవరకొండ డీఈ శ్రీనివాస్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా మూడు నెలలు పనిచేసిన తరువాత డీఈగా ఏ.వెంకటేశ్వర్లును నియమించారు. ఆయన మిర్యాలగూడ మండల నివాసి కావడంతో ఏడాది వరకు పని చేశాక ఆయనను బదిలీ చేసి.. సిద్దిపేట నుంచి శ్రీనివాస్‌ బదిలీపై మిర్యాలగూడకు పంపారు. తిరిగి ఆయనను కూడా వారం రోజుల వ్యవధిలోనే కర్నూలుకు బదిలీ చేశారు. తర్వాత ఎస్‌.వెంకటేశ్వర్లు డీఈగా రాగా మూడు నెలలు పనిచేశాక నల్లగొండకు బదిలీ చేశారు. ఆ తర్వాత శ్రీనివాససుధీర్‌కుమార్‌కు డీఈగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. రెండు నెలల వ్యవధిలోనే ఆయనను తిరిగి వెనక్కి పంపి డీఈగా విద్యాసాగర్‌ను నియమించారు. రెండు నెలల తర్వాత విద్యాసాగర్‌ను బదిలీ చేసి శ్రీనివాససుధీర్‌కుమార్‌ను గతేడాది అక్టోబర్‌లో మిర్యాలగూడ డీఈగా నియమించారు. కనీసం ఆరు నెలలు గడవకముందే ఇటీవల బదిలీ చేశారు. కొత్త డీఈగా శ్రీనివాసచారిని నియమించారు. ఆయన బుధవారం విధుల్లో చేరారు.

25 ఏళ్లుగా సబ్‌ డివిజన్‌లోనే

కొందరు విధులు..

● మిర్యాలగూడ సబ్‌ డివిజన్‌లో పనిచేసే సిబ్బంది కొందరు 20 ఏళ్లకుపైగా ఇక్కడే ఉంటున్నారు. ఉన్నతాధికారులను సైతం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

● మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ విద్యుత్‌శాఖలో హెల్పర్‌గా చేరి సహాయ లైన్‌మెన్‌, లైన్‌మెన్‌గా పనిచేసి ఇటీవల లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది సబ్‌ డివిజన్‌లో పనిచేస్తున్నారు.

● స్థానికంగా నివాసం ఉంటున్న ఒకరు హెల్పర్‌గా పనిచేసి ఏఎల్‌ఎం, లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

● విద్యుత్‌శాఖలో హెల్పర్‌గా విధుల్లో చేరిన ఇద్దరు సహాయ లైన్‌మెన్లుగా, లైన్‌మెన్లుగా, లైన్‌ ఇన్‌స్పెక్టర్లుగా, సబ్‌ ఇంజనీర్లుగా ఒకేసబ్‌ డివిజన్‌లో 20 ఏండ్లుగా పనిచేస్తున్నారు.

● విద్యుత్‌ ఏఈ ఒకరు సబ్‌ డివిజన్‌లోనే 20 ఏండ్లకు పైగా విధులు నిర్వరిస్తున్నారు.

బయోమెట్రిక్‌ అమలుకు సన్నాహాలు!

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్‌శాఖ ఉద్యోగ సంఘాలు.. ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలని ధర్నాలు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఇలా సంఘాల వారే ధర్నా చేయడంతో విద్యుత్‌శాఖ పరువు బజారున పడుతుందని.. ఇక, దశలవారీగా బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement