మోటకొండూర్: ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రాగి వైరు అపహరించారు. ఈ ఘటన మోటకొండూర్ మండలంలోని అమ్మనబోలు గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మనబోలు గ్రామానికి చెందిన సంగు నర్సిరెడ్డి తన వ్యవసాయ బావి వద్ద రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశాడు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ లైన్‌ను కట్ చేసి ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైరును దొంగిలించారు. ఆదివారం ఉదయం అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన మర్యాల నరేష్ ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైరు చోరీకి గురైనట్లు గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించాడు. అపహరణకు గురైన రాగి వైరు విలువ రూ.1.5లక్షలు ఉంటుందని ఏఈ వినోద్ తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో ఎలుకల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆది వారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన సిరుగురి లింగస్వామి(46) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎలుకల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి మేనల్లుడు అంతటి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు.
రైల్వే స్టేషన్‌లో బైక్ చోరీ
రామగిరి(నల్లగొండ): తిప్పర్తి రైల్వే స్టేషన్‌లో బైక్ చోరీకి గురైంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలానికి చెందిన కామర్ల వెంకటేశ్వర్లు తిప్పర్తి రైల్వే స్టేషన్‌లో పాయింట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. నవంబర్ 1వ తేదీన తిప్పర్తి రైల్వే స్టేషన్‌లో తన బైక్‌ను పార్కింగ్ చేసి డ్యూటీకి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి రైల్వే స్టేషన్‌లో తన బైక్ కనిపించలేదు. ఎక్కడ వెతికినా బైక్ ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ధర్మా తెలిపారు.
ఉరేసుకొని రైతు ఆత్మహత్య
చౌటుప్పల్: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండల పరిధిలోని జైకేసారం గ్రామ పంచాయతీ మధిర అస్సోనిగూడెంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సోనిగూడెం గ్రామానికి చెందిన యడ్ల పక్కీరు(42)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పక్కీరు వ్యవసాయంతో పాటు కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనికి వెళ్లిన పక్కీరు భార్య సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ యాదగిరి తెలిపారు.
గల్లంతైన యువకుడి
మృతదేహం లభ్యం
బీబీనగర్: బీబీనగర్ పెద్ద చెరువులో శనివారం గల్లంతైన యువకుడి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. ఎస్‌ఐ యుగేంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలోని చెంగిచెర్లలోని గణేష్‌నగర్‌కు చెందిన పండిపాటి మహేష్(27) మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన మహేష్ శనివారం బీబీనగర్ పెద్ద చెరువు వద్దకు చేరుకొని అందులో దూకాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.