
నల్గొండ: భారత రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్లు నిండిన భారత పౌరులందరికీ ఓటు హక్కు ఉంటుంది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ప్రివెంట్యూ డిటర్మినేషన్ పద్ధతిలో ఓటు వేయవచ్చు.
నియోజకవర్గం పేరును సూచిస్తూ తాము ఓటర్లమని పోలింగ్ బూత్, ఓటరు క్రమసంఖ్యతో ఓటేసే అవకాశం కల్పించాలని రాతపూర్వకంగా జైలర్‌ను కోరాలి. ఖైదీలు సూచించిన ప్రాంతాల నుంచి పోస్టల్ బ్యాలెట్లను తెప్పించి జైలు నుంచే ఓటేసే అవకాశం కల్పిస్తారు.
పోలింగ్ బూత్‌లో ప్రత్యేక నిబంధనలు
► పోలింగ్ రోజున ఓటరు గోప్యత పాటించకుండా తాను ఎవరికి ఓటు వేసే విషయాన్ని బహిర్గతం చేస్తే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు భావించి సదరు వ్యక్తిని ఓటు వేయడానికి అనుమతించరు.
► అంధులు ఓటు వేసేందుకు వీలుగా అతడికి సహాయకుడిగా 18 ఏళ్లు నిండిన వ్యక్తిని అధికారులు పోలింగ్ కేంద్రానికి అనుమతిస్తారు. సహాయకుడిగా వచ్చే వ్యక్తి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొస్తేనే అనుమతిస్తారు.
► ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చినప్పుడు అప్పటికే అతడి ఓటు ఎవరైనా వేస్తే పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అప్పడు అది టెండర్ ఓటుగా పరిగణించి పోలింగ్ అధికారుల వద్ద ఉండే ప్రత్యేక బ్యాలెట్ పేపర్ ద్వారా పాత పద్ధతిలో ఓటు వేయవచ్చు.
► ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు అది బోగస్ ఓటు అని, తక్కువ వయస్సు అని పోలింగ్ ఏజెంట్లు చాలెంజ్ చేస్తే పోలింగ్ అధికారి ఏజెంట్ నుంచి విషయాలను సేకరిస్తారు. ప్రాథమిక విచారణ జరిపి ఆరోపణ నిజమైతే సదరు ఓటరును పోలీస్ సిబ్బందికి అప్పగిస్తారు.
► ఒక ఓటరు తాను నచ్చిన పార్టీకి ఓటు వేస్తే.. అది వేరే పార్టీకి పడ్డట్లు ఆరోపణలు చేస్తే అధికారులు టెస్టు ఓటును అనుమతిస్తారు. అయితే ఆ ఆరోపణలు రుజువు కాకుంటే చర్యలు తీసుకుంటామని కూడా సదరు ఓటరుకు ముందే హెచ్చరిస్తారు.
– తిరుమలగిరి (తుంగతుర్తి)