
మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా ఉన్న నల్లగొండలోని ప్రకాశం బజార్
నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా శుక్రవారం నిప్పుల కుంపటిని తలపించింది. దామరచర్ల, నిడమనూరు, కేతేపల్లి మండలాల్లో ఏకంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 41 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు రోజుల క్రితం ఉపరితల ద్రోణి కారణంగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాతావారణం చల్లబడడంతో ప్రజలు ఊరట చెందారు. ఇప్పుడు ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల వరకు పెరిగిపోవడంతో ఎండ తీవ్రత కారణంగా జనం అల్లాడారు. ఉపాధి హామీ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు ఎండలతో అనేక ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యోగుల సైతం ఎండ తీవ్రతకు తల్లడిల్లిపోయారు.
కర్ఫ్యూను తలపించిన వీధులు
ఎండ తీవ్రత పెరగడంతో ఉదయం 9 గంటల నుంచే నల్లగొండ పట్టణంలోని ప్రధాన రహదారులు జనం లేక కర్వ్యూని తలపించాయి. సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు సాహసించలేదు. ఏసీలు, కూలర్లు వాడకం పెరిగి.. విద్యుత్ వినియోగం పెరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. రోహిణి కార్తె కావడంతో ఎండ తీవ్రత ఎక్కుగా ఉంది. మృగశిర కార్తె ప్రారంభమయ్యాక ఎండలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫ జిల్లా అంతటా నిప్పుల కుంపటి
ఫ ఎండ తీవ్రతకు అల్లాడిన జనం
ఫ కర్ఫ్యూను తలపించిన వీధులు