ప్రజాక్షేత్రంలోకి బీజేపీ | - | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలోకి బీజేపీ

Jun 3 2023 1:48 AM | Updated on Jun 3 2023 1:48 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజా క్షేత్రంలోకి వెళ్లే కార్యాచరణతో జిల్లాలో బీజేపీ స్పీడ్‌ పెంచేందుకు సిద్ధమైంది. ఈ నెలాఖరు వరకు వరుస కార్యక్రమాలను రూపొందించుకుంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లనుంది. వారంలో పార్టీ అంతర్గత కార్యక్రమాలతో ప్రారంభించి, రెండో వారం, మూడో వారం సభలు, బహిరంగ సభలు నిర్వహించాలని, నాలుగో వారంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మహజన సంపర్క్‌ అభియాన్‌ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని నిర్ణయించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పదాధికారులు, ఇన్‌ఛార్జీలు, పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్లు, అసెంబ్లీ కన్వీనర్లతో ఇటీవల సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ నెలలో ఒక్కో వారంలో ఒక్కో రకమైన కార్యక్రమాలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

రెండో వారం నుంచి వేగవంతం

మొదటి వారంలో పార్టీ అంతర్గత విభాగాలతో సమావేశాలు నిర్వహించుకొని రెండో వారం నుంచి బహిరంగ కార్యక్రమాలకు బీజేపీ ప్లాన్‌ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా సీనియర్‌ నాయకుల సమ్మేళనాలు నిర్వహించనుంది. అక్కడే భోజన ఏర్పాట్లు చేయడంతోపాటు ఆయా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు వివరించనుంది. ఆ తర్వాత అసెంబ్లీ స్థానం వారీగా సంయుక్త మోర్చాల సమ్మేళనాలు, నియోజకవర్గానికి 150 మంది ప్రముఖులను కలవడం, కేంద్ర పథకాలను వివరించడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. 10వ తేదీన లేదా 11న నల్లగొండ క్లస్టర్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండేతో నల్లగొండలో సభ నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ నెల మూడో వారంలో ఒక్కో నియోజకవర్గంలో 5వేల మందితో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహించనుంది. 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 21వ తేదీన మండలాల వారీగా యోగా దివస్‌ నిర్వహించనున్నారు.

నాలుగో వారంలో ఇంటింటికి బీజేపీ

ఇక.. నాలుగో వారంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించనున్నారు. శక్తి కేంద్రాల వారీగా కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమ్మేళనాలు, ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, వారితో సమావేశం కావడం, వంటి కార్యక్రమాలను చేపడతారు. 25వ తేదీన పోలింగ్‌ బూత్‌ స్థాయిలో మన్‌కీ బాత్‌ నిర్వహిస్తారు. ఇంటింటికి ప్రచారంలో కరపత్రాలను, స్టిక్కర్లను అందిస్తారు.

కేంద్ర పథకాలను వివరిస్తాం

కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలకు చేకూరుతున్న మేలును ప్రజలకు వివరిస్తాం. 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేకూరిన ప్రయోజనాలను తెలియజేస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం.

–కంకణాల శ్రీధర్‌రెడ్డి,

బీజేపీ జిలా అధ్యక్షుడు

పక్కాగా ఏర్పాట్లు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా కార్యాచరణను సిద్ధం చేశాం. కేంద్ర పథకాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరిన మేలును వివరించడం ద్వారా ప్రజలు బీజేపీ వైపు మళ్లేలా కృషి చేస్తాం. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిక స్థానాలు గెలుచుకునేలా చర్యలు చేపడుతున్నాం.

–మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

ఫ మహాజన సంపర్క్‌ అభియాన్‌ పేరుతో కార్యక్రమాలకు సన్నద్ధం

ఫ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో ప్రజల్లోకి..

ఫ మూడో వారంలో బండి సంజయ్‌తో నల్లగొండలో బహిరంగ సభ

ఫ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement