
నాగరాజు (ఫైల్)
నల్లగొండ క్రైం: పానగల్లులోని ఉదయ సముద్రంలో గురువారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. నల్ల గొండ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన అంబటి నాగరాజు(30) తన భార్య ప్రశాంతి, ఇద్దరు కుమార్తెలతో కలిసి నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లులో అద్దె ఇంట్లో నివాసముంటూ ఉదయ సముద్రంలో చేపలు పడుతూ జీవనోపాధి పొందుతున్నాడు. గురువారం కూడా అతడు చేపలు పట్టేందుకు తెప్పపై ఉదయ సముద్రంలోకి వెళ్లగా ఈదురుగాలులకు తెప్ప తిరగబడడంతో నీటిలో పడిపోయాడు. ఒడ్డుకు 10ఫీట్ల దూరం వరకు ఈదుకుంటూ వచ్చిన నాగరాజు అప్పటికే అలసిపోయి చెరువులోనే గల్లంతయ్యాడు. తోటి జాలర్లు గమనించి నాగరాజు మృతదేహం కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని గురువారం రాత్రంతా నాగరాజు మృతదేహం వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఒడ్డున నాగరాజు మృతదేహం లభ్యమవ్వడంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
పెద్దదేవులపల్లిలో విషాదఛాయలు..
త్రిపురారం: అంబటి నాగరాజు మృతితో త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగరాజు నల్ల గొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లులో నివాసముంటూ పెద్దదేవులపల్లి గ్రామంలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో సివిల్ వర్కర్‌గా పనిచేస్తుండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో పాటు నాగరాజు మత్స్యకారుడు కావడంతో అదనపు ఆదాయం కోసం సమయం ఉన్నప్పుడల్లా పానగల్లులోని ఉదయ సముద్రంలో చేపలు పట్టి అమ్మేవాడని తెలిపారు. కాగా శుక్రవారం పెద్దదేవులపల్లిలో నాగరాజు కుటుంబ సభ్యులు అతడి అంత్యక్రియలు నిర్వహించారు. నిరుపేద అయిన నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని పెద్దదేవులపల్లి మత్స్యకార సంఘం సభ్యులు కోరుతున్నారు.
పానగల్లులోని ఉదయ సముద్రంలో ప్రమాదం
మృతుడి స్వస్థలం త్రిపురారం
మండలంలోని పెద్దదేవులపల్లి