గుట్టుగా నకిలీ విత్తనాల దందా! | - | Sakshi
Sakshi News home page

గుట్టుగా నకిలీ విత్తనాల దందా!

Jun 3 2023 1:48 AM | Updated on Jun 3 2023 1:48 AM

- - Sakshi

చౌటుప్పల్‌: వానాకాలం సమీపిస్తుండడంతో నకిలీ విత్తనాల వ్యాపారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నా వ్యాపారులు తమకున్న మార్గాల ద్వారా అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. చౌటుప్పల్‌కు చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి రైతులకు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తుండగా అతడి దుకాణంపై ఇటీవల ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి రూ.60లక్షల విలువ చేసే విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

నాగపూర్‌ నుంచి సరఫరా

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రావి చంద్రశేఖర్‌ కొన్నేళ్ల క్రితం చౌటుప్పల్‌కు వచ్చాడు. నవత ఆగ్రో డివిజన్‌ పేరిట దుకాణం ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కుమారుడు ప్రసన్నకుమార్‌ సైతం ఇదే వ్యాపారంలో ఉన్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా గారపాడు గ్రామానికి చెందిన గడ్డం రవీంద్రబాబు, చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన నర్సింహులుతో కలిసి ప్రసన్నకుమార్‌ నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నాడు. నిషేధిత బీటీ–3 హెచ్‌టీ విత్తనాలను మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నాగపూర్‌ నుంచి పెద్ద ఎత్తున తీసుకువచ్చిన పత్తి విత్తనాలను చౌటుప్పల్‌లోని గోదాంలో నిల్వ చేశారు. రైతులకు సరఫరా చేసే క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటీ పోలీసులు గురువారం దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 2.2 టన్నుల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు సభ్యులు గల ముఠాలో రవీంద్రబాబు, ప్రసన్నకుమార్‌ను అదుపులోకి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు నర్సింహులు పరారయ్యాడు. కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ రూ.60లక్షల వరకు ఉంటుందని అంచనా. ఎస్‌ఓటీ పోలీసులు ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. కాగా పట్టుబడిన విత్తనాలను గురువారం హైదరాబాద్‌లో సీపీ డీఎస్‌ చౌహాన్‌ సమక్షంలో వ్యవసాయాధికారులు టెస్ట్‌ చేయగా నకిలీవిగా నిర్ధారణ అయ్యింది.

లాభార్జనే ధ్యేయంగా..

విత్తన దుకాణాల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సీజన్‌ ప్రారంభం అవ్వగానే తనిఖీ బృందాల కళ్లుగప్పి రకరకాల విత్తనాలు తీసుకువచ్చి రైతులకు అంటగడుతున్నారు. చేను ఎదుగుదల, పంటల దిగుబడి వంటి అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు.

హడావుడిగా తనిఖీలు!

నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఎరువులు, విత్తన దుఖానాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయినా వ్యాపారులు అధికారుల కళ్లుగప్పి తమ దందా కొనసాగిస్తున్నారు. అధికారులు దుకాణదారులతో ఉన్న సంబంధాలతో మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

నాగపూర్‌ కేంద్రంగా వ్యాపారం

ఫ పోలీసుల కళ్లు గప్పి రైతులకు సరఫరా

ఫ చౌటుప్పల్‌లోని నవత ఆగ్రో డివిజన్‌ గోదాముపై ఎస్‌ఓటీ పోలీసుల దాడులు

ఫ 2.2 టన్నుల నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం

ఫ ఇద్దరి అరెస్ట్‌, పరారీలో మరొకరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement