వడదెబ్బతో ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఒకరు మృతి

Jun 3 2023 1:48 AM | Updated on Jun 3 2023 1:48 AM

బోల్తా పడిన ట్రాక్టర్‌  - Sakshi

బోల్తా పడిన ట్రాక్టర్‌

పెద్దవూర: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతిచెందాడు. పెద్దవూర మండలం నీమానాయక్‌తండాకు చెందిన రమావత్‌ బాలు(33) గురువారం తన వ్యవసాయ పొలంలో పనులు చేయటానికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. విపరీతమైన ఎండలకు వడదెబ్బకు గురై ఇంటికి రాగానే కడుపులో నొప్పి వస్తుందని వాంతులు చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పచ్చిపాల పరమేష్‌ తెలిపారు.

యువకుడు అదృశ్యం

చౌటుప్పల్‌: పట్టణ కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కాలనీలో మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు గురువారం తప్పిపోయాడు. ఈమేరకు ఎస్సై సైదులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని చింతల్‌లోని వాజ్‌పేయినగర్‌కు చెందిన కుంభా యేసమ్మ తన కుమారుడు కుంభా సాయి(19)తో కలిసి స్థానిక హనుమాన్‌నగర్‌లో ఉంటుంది. యేసమ్మ కేశాల వ్యాపారం చేస్తుంటుంది. కుమారుడు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఇంటి వద్దే ఉంటాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సాయి తిరిగి ఇంటికి చేరుకోలేదు. స్థానికంగా, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యేసమ్మ శుక్రవారం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

మంటలు చెలరేగి రెండు బైక్‌లు, ఆటో దగ్ధం

డిండి: వివాహం జరిగిన ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు టెంటుకు నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగి రెండు బైక్‌లు, ఆటో దగ్ధమయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం డిండి మండలంలోని గోనబోయనపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనబోయనపల్లి గ్రామానికి చెందిన మండి వెంకటయ్య కుమారుడు సైదులు వివాహం గురువారం జరిగింది. వివాహాన్ని పురస్కరించుకొని ఇంటి ముందు ఏర్పాటు చేసిన టెంట్‌కు గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు నిప్పుంటుకొని మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వెంకటయ్య కుటుంబ సభ్యులు, బంధువులు మంటలు ఆర్పేసరికి టెంటు కింద ఉన్న నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం గాజర గ్రామానికి చెందిన గణేష్‌ బైక్‌తో పాటు మరో బంధువు బైక్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. అదేవిధంగా మండి వెంకటయ్యకు చెందిన ఆటోలోని సీట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనకు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటే కారణమై ఉండవచ్చవని పలువురు భావిస్తున్నారు.

గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ బోల్తా

త్రిపురారం: మండలంలోని బొర్రాయిపాలెం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ హర్జతండా సమీపంలో శుక్రవారం బోల్తా పడింది. ట్రాక్టర్‌ నడపడం రాని వ్యక్తి ట్రాక్టర్‌ నడపడంతోనే బోల్తా పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ట్రాక్టర్‌లో సెంట్రింగ్‌కు సంబంధించిన సామత్రి ఉండడంతో గ్రామపంచాయతీ పనులకు కాకుండా ఇతర పనులకు ట్రాక్టర్‌ను వినియోగిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్‌ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బొర్రాయిపాలెం సర్పంచ్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

చార్‌ధామ్‌ యాత్రలో కొండమల్లేపల్లి వాసి మృతి

కొండమల్లేపల్లి: చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌ దర్శనానికి వెళ్లి కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ మారం మురళి(75) మే 27న మండల కేంద్రానికే చెందిన కండె చంద్రయ్య కుటుంబ సభ్యులతో కలిసి చార్‌ధామ్‌ యాత్రకు బయల్దేరారు. యాత్ర ప్రారంభమైన నాటి నుంచి తన యోగక్షేమాలు ఫోన్‌ ద్వారా కుమారుడు వెంకటేశ్వర్లుకు తెలియజేసేవాడు. గురువారం మురళి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో కుమారుడు వెంకటేశ్వర్లు తన తండ్రి గురించి తెలుసుకునేందుకు కండె చంద్రయ్యకు ఫోన్‌ చేశాడు. తామంతా గదిలోనే ఉన్నామని, మురళి ఒక్కడే గుర్రంపై కేదార్‌నాథ్‌ దర్శనానికి వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదని ఆయన తెలిపాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం తన తండ్రి మరణించినట్లు తెలిసిందని వెంకటేశ్వర్లు పేర్కొన్నాడు. మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావడం కోసం ఉత్తరాఖండ్‌ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

సాయి1
1/2

సాయి

మురళి (ఫైల్‌)2
2/2

మురళి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement