నల్లగొండ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నల్లగొండలోని బాలభవన్ విద్యార్థులు, నాగార్జునసాగర్ పాఠశాల విద్యార్థులు, న్యాక్స్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులతో పాటు పలువురు తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటాలను ఆవిష్కరించే విధంగా కళా నృత్యాలు ప్రదర్శించారు. కోలాటం తదితర ఆటాపాటలతో తెలంగాణ సాధించిన ప్రగతిపై నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కప్ క్రీడాపోటీల్లో రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
పాఠశాలలో చోరీకి యత్నం
మాడుగులపల్లి: మండలంలోని కుక్కడం ప్రాథమికోన్నత పాఠశాలలో దుండగులు చోరీకి యత్నించారు. ఆఫీస్ గది తలుపులు పగులగొట్టి బీరువాలను తెరిచేందుకు ప్రయత్నించారు. హెచ్‌ఎం వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫీస్ గదిలో కంప్యూటర్లు, మధ్యాహ్న భోజనానికి కావాల్సిన బియ్యం, ఇతర వస్తువులతో పాటు మూడు బీరువాలు ఉన్నాయి. వీటిలో సైన్స్ మెటీరియల్, రికార్డులు, ఆట సామగ్రి భద్రపరిచారు. కాగా దుండగులు గది తలుపులు ధ్వంసం చేసి ఓ బీరువాను ఇనుప చువ్వ సాయంతో తెరిచారు. ఇందులో సైన్స్ మెటీరియల్ ఉండడంతో అలాగే వదిలేశారు. మిగిలిన రెండింటి తలుపులు తెరుచుకోకపోవడంతో వెళ్లిపోయారు. శుక్రవారం దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సిబ్బంది పాఠశాలకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మే 12న పాఠశాలను సందర్శించినప్పుడు సవ్యంగానే ఉందని, ఆ తర్వాత ఈ ఘటన జరిగిందని హెచ్‌ఎం భావిస్తున్నారు. బీరువాలోని ఆట వస్తువుల కోసమే చోరీకి యత్నించినట్లు అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.