భూదాన్‌పోచంపల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బద్దం రాజు(26)కు భార్య తులసి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా పని సరిగా నడవకపోవడంతో అప్పులు చేశాడు. అంతేకాక మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, తండ్రితో గొడవపడ్డాడు. అనంతరం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రి గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం గ్రామానికి చెందిన దేవిగారి బాలయ్య అనే రైతు గ్రామశివారులో ఉన్న వ్యవసాయబావి వద్దకు పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తుండగా అక్కడ చెట్టుకు చొక్కాతో ఉరివేసుకున్న రాజును గమనించాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు.