
ఫోన్ డైరెక్టరీని ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి జగ్జీవన్‌కుమార్
హాలియా : హరితహారం పనుల్లో అలసత్వం వహించొద్దని, ప్రభుత్వ లక్ష్యం మేరకు నర్సరీల్లో మొక్కలు పెంచి నాటే ఏర్పాట్లు చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం అనుముల మండలంలోని మారేపల్లి, పులిమామిడి గ్రామాల్లో నర్సరీలు, వర్మి కంపోస్టు తయారీ విధానాన్ని ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జూన్‌లో చేపట్టే హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను నర్సరీల్లో పెంచాలని సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓ బత్తుల వెంకటేశ్వర్లు, ఏపీఓ శ్యామల, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
రామగిరి(నల్లగొండ) : మహిళలకు చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ బి.దీప్తి పేర్కొన్నారు. సోమవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ హక్కులను వినియోగించుకోవాలన్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి లీగల్ సెల్ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ జి.అంబేద్కర్, గంజి బాగ్యలక్ష్మి, శివరాణి, పీడీ మల్లేష్, నాగిళ్ల శంకర్ పాల్గొన్నారు.
సిలిండర్ల కొరత లేకుండా చూడాలి
నల్లగొండ : రంజాన్, శ్రీరామనమి పండుగలు సమీపిస్తున్నందున ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్ల సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రతలు తీసుకోవాలని డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగల సందర్భంలో ఏజెన్సీలు కార్యాలయాలు, గోదాములను తెరిచే ఉంచాలని సూచించారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా 5 కేజీల సిలిండర్లను కూడా షాపులు అందుబాటులో ఉంచాలని కోరారు.
ఫోన్ డైరెక్టరీ ఆవిష్కరణ
రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల ఫోన్ డైరెక్టరీని జిల్లా జడ్జి బిఎస్.జగ్జీవన్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల ఫోన్ డైరెక్టరీ అందరికీ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు న్యాయమూర్తి జయరాజు, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి తిరుపతి, లీగల్ సెక్రటరీ దీప్తి, జూనియర్ సివిల్ జడ్జి కీర్తి చంద్రికారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసులు, సెక్రటరీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష
నల్లగొండ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు సోమవారం జరిగాయి. ఈ పరీక్షకు మొత్తం 15,059 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 14,539 మంది హాజరయ్యారు. 520 మంది గైర్వాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది.

నర్సరీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్

మాట్లాడుతున్న డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు