
ఆలయ తిరు వీధుల్లో భక్తుల రద్దీ (ఫైల్)
ఎన్నో మార్పులు..
యాదగిరిగుట్ట: ఈ యేడాదిలో యాదాద్రి ఆలయంలో నూతన కార్యక్రమాలకు సైతం ఆచార్యులు, అధికారులు శ్రీకారం చుట్టారు. విశేష పూజలను ప్రారంభించారు. గతేడాది జూలైలో శ్రావణ మాసం సందర్భంగా కోటి కుంకుమార్చన పూజలను తొలిసారిగా చేపట్టారు. అక్టోబర్ 31న బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. రూ.300 టిక్కెట్ రుసుముతో బ్రేక్ దర్శనం ఉదయం 9 నుంచి 10 గంటలకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అంతే కాకుండా భక్తులకు ఇంటి నుంచే బుకింగ్ చేసుకునే విధంగా ఆన్‌లైన్ పూజల టిక్కెట్ సేవలను ప్రారంభించారు. ఇక కొండ కింద గల తులసీ కాటేజీలో రూ.21కోట్ల వ్యయంతో నిర్మించిన 240 గదుల సముదాయాన్ని జనవరి 2న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, విప్ సునిత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావులు ప్రారంభించారు. రింగ్ రోడ్డులోని గండి చెరువు సమీపంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని ప్రారంభించారు. కొండపైన కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను ప్రారంభించి, నిత్యం వాటి ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటనకు నేటికి ఏడాది
ఫ పెరుగుతున్న భక్తుల సంఖ్య
ఫ అసౌకర్యాలతో సతమతం
ఫ ఇప్పటికీ కొనసాగుతున్న పనులు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన జరిగి మంగళవారం నాటికి ఏడాది పూర్తయింది. ఇంకా భక్తులకు సరైన వసతులు సమకూరడం లేదు. రూ.1200 కోట్ల వ్యయంతో యాదాద్రి ఆలయ నగరి పూర్తి చేశారు. గత సంవత్సరం మార్చి 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ఉద్ఘాటన జరిగింది. ఆరేళ్ల తర్వాత స్వయంభూల దర్శనం కలుగడంతో దేశ, విదేశీ భక్తులు పెద్ద ఎత్తున శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు సమకూరకపోవడంతో భక్తులు అసౌకర్యాల నడమనే స్వామిని దర్శించుకుంటున్నారు.
ఇవీ.. ప్రధాన సమస్యలు
● రూ.11 కోట్ల దాతల నిధులతో చేపట్టిన అన్నప్రసాద వితరణ కేంద్రం పనులు ఇంకా సాగుతున్నాయి. దీక్షాపరుల మండపంలో రోజు 1000 మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు.
● భక్తులకు దేవస్థానం ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో కనీసం నీడ లేదు. వేలాది మంది భక్తులు సొంత వాహనాల్లో గుట్టకు చేరుకుంటున్నారు. పార్కింగ్‌లో తమ వాహనాలను నిలిపి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సుల కోసం ఎండ, వానలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
● రూ.50 కోట్లతో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే స్వామి వారి గిరిప్రదర్శన మార్గం పనులు పూర్తికాక 2.7 కిలోమీటర్లు అస్తవ్యస్తంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టిరోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది.
● శ్రీ స్వామి వారి క్షేత్రంలో వ్యాపార సముదాయాల కోసం నిర్మిస్తున్న కాంప్లెక్స్ నిర్మాణాలు పూర్తికాలేదు. దేవస్థానం బస్టాండ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొండపైన రూ. 1.07 కోట్లతో చేపట్టిన బస్ బే పనులు పూర్తి కావడంలే దు. భక్తులకు కొండపైన ఎలాంటి వసతులూ లేవు. గతంలో బాలాలయం నిర్మించిన చోట సంగీతభవన్ నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
● ప్రధానంగా ఆలయంలో దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులకు కనీసం నిలువ నీడలేదు. దర్శనం తర్వాత కొద్దిసేపు ఆలయం ఆవరణలో కూర్చునే పరిస్థితి లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్లు అత్యాధునిక వసతులతో నిర్మించారు. దాతల విరాళాలతో నిర్మించిన వీటిని భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. 14 విల్లాల్లో 70 సూట్ గదులు అందుబాటులోఉన్నాయి. ఇక్కడ బస చేసే భక్తులకు క్యాంటీన్ సౌకర్యం లేదు.
● దేవస్థానం మొదట్లో నడిపిన విధంగా 45 ఆర్టీసీ బస్సులను ఆర్థిక భారంతో 20కి తగ్గించారు. దీంతో భక్తులు పరిమితికి మించి బస్సులలో ప్రయాణం చేస్తున్నారు.
పెద్దగుట్టపై వసతుల గదులేవీ
పెద్దగుట్టపై భక్తుల వసతులు కోసం నిర్మించ తలపెట్టిన అధునాతన వసతి గృహాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 250 ఎకరాల్లో లే అవుట్ సిద్ధం చేశారు కానీ, దాతల నుంచి విరాళాలు వస్తే తప్ప విల్లాలు పూర్తిచేసే పరిస్థితి లేదు.
పెరిగిన భక్తుల సంఖ్య
శ్రీస్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య పెరిగింది. ప్రముఖులు, విదేశీయుల సంఖ్య సైతం పెరిగింది. ఆస్ట్రేలియా, ఇటలీ, అమెరికా, స్వీట్జర్లాండ్, కెనడా వంటి దేశస్తులు శ్రీస్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు, ప్రముఖులు అధికంగా వస్తుండటంతో గతంలో కంటే ప్రస్తుతం హుండీల ఆదాయం రికార్డు స్థాయిలో రూ.2కోట్లు దాటింది.

నిర్మాణం పూర్తికాని మొదటి ఘాట్‌రోడ్డు

కొండపై కమాండ్ కంట్రోల్ రూం (ఫైల్)