
డీసీఎం రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబంలోని ఇద్దరిని కబళించగా మరో ముగ్గురికి ఆస్పత్రి పాల్జేసింది.
నల్గొండ: పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగెళ్తున్న ఓ కుటుంబానికి మార్గమధ్యలో అనుకోని ఆపద ఎదురైంది. డీసీఎం రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబంలోని ఇద్దరిని కబళించగా మరో ముగ్గురికి ఆస్పత్రి పాల్జేసింది. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారు నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన గొడ్డేటి మధులత(22), గొడ్డేటి నర్సయ్య(75), గొడ్డేటి బాలాజీ, గొడ్డేటి సోమమ్మ, గొడ్డేటి కోటేష్, సాత్విక్‌లు సోమవారం తమ ఆటోలో మాడ్గులపల్లి మండలం పూసలపాడు గ్రామానికి వచ్చారు.
నర్సయ్య తమ్ముడి మనుమరాలైన నడ్డి మంజులకృష్ణయ్య కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలకు హాజరై ఆనందంగా గడిపారు. వేడుకల అనంతరం సాయంత్రం తిరిగి అదే ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో శెట్టిపాలెం గ్రామ శివారులోగల మిరియం అనాథాశ్రమం వద్దకు చేరుకోగానే అదే సమయంలో సమీపంలో మిల్లు నుంచి తవుడు లోడ్‌తో డీసీఎం వాహనం వేములపల్లి వైపు రాంగ్‌రూట్‌లో వెళ్తూ ఆటోను ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న మధులత ఒక్కసారిగా కిందపడడంతో డీసీఎం వాహనం ఆమైపె వెళ్లగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ ప్రమాదంలో గాయపడిన సోమమ్మ, నర్సయ్య, బాలాజీ, కోటేష్, సాత్విక్‌లను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడిన నర్సయ్య చికిత్స పొందుతూ మృతిచెందగా, సోమమ్మ పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతిచెందిన మధులత, నర్సయ్య మృతదేహాలను వేములపల్లి ఎస్‌ఐ శ్రీను సందర్శించి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతిచెందిన మధులత మిర్యాలగూడ పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో డీసీఎం రూపంలో వారిని మృత్యువు కబళించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
బటర్‌ఫ్లై లైట్లు ఏర్పాటు చేయాలి...
నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై గల ఏడుకోట్ల తండా నుంచి మండలంలోని అన్నపురెడ్డిగూడెం క్రాస్ రోడ్డు వరకు పారిశ్రామిక ప్రాంతంగా గుర్తించి బటర్‌ఫ్లై లైట్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా మిల్లుల నుంచి రాంగ్‌రూట్‌లో వస్తున్న వాహనాల కట్టడికి మిల్లుల యజమానులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పలు గ్రామాలకు చెందిన వాహనదారులు పేర్కొంటున్నారు.