అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం

Jun 3 2026 12:39 AM | Updated on Jun 3 2026 12:39 AM

విద్య, వైద్యానికి

అధిక నిధులు..

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందన్నారు. మెడికల్‌ కళాశాలలో వసతుల కల్పనతో పాటు టీ డయాగ్నొస్టిక్‌ హబ్‌లో ఉచితంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 13,400 కాన్పులు చేసినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపికై న 751 పాఠశాలలకు రూ. 6.27కోట్లు కేటాయించినట్టు చెప్పారు. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లతో పాటు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లోని వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఇప్పటివరకు నల్లమలలో 36 పెద్దపులులు, 250 చిరుతలు, 200 పైగా పక్షుల రకాలను గుర్తించినట్లు తెలిపారు. అనంతరం పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను వారు సందర్శించి పరిశీలించారు.

‘పాలమూరు’పై ప్రత్యేక దృష్టి

జిల్లాలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగా చేపట్టిన 12 ప్యాకేజీల్లో పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదే విధంగా మార్కండేయ ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, కేఎల్‌ఐ కింద అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో మరో 15వేల ఎకరాలకు నీరు అందించేందుకు రూ. 107.20 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మల్లు రవి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు పేదలు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ప్రతి ఇంటికీ లబ్ధి..

ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందని చెప్పారు. రైతుభరోసా కింద జిల్లాలో 3.19 లక్షల మంది రైతులకు రూ. 694.11 కోట్లు చెల్లించామన్నారు. క్వింటా సన్నరకం వరిధాన్యానికి రూ.500 చొప్పున బోనస్‌ అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా సుమారు 9.60లక్షల సార్లు మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడంతో రూ. 448.51లక్షల వరకు ఆదా అయ్యిందన్నారు. రూ.500కే సిలిండర్‌ పథకం కింద 1.18 లక్షల మంది వినియోగదారులు లబ్ధి పొందారని చెప్పారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్‌ను అందిస్తుండగా.. ఇప్పటివరకు 1.14 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు.

కొత్తగా మరో 2వేల ఇందిరమ్మ ఇళ్లు..

సొంతిల్లు లేని నిరుపేదలందరికీ తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. జిల్లాలో ఈ పథకం కింద మొత్తం 2.70 లక్షల దరఖాస్తులు రాగా.. మొదటి విడతలో 10,639 ఇళ్లను మంజూరుచేశామని చెప్పారు. ఇప్పటివరకు 8,402 ఇళ్లకు మార్కింగ్‌ చేయగా.. 2,100 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్‌, 2,763 ఇళ్లు పైకప్పు స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 1,122 నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. రెండో విడతలోనూ కొత్తగా 2వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్‌ రోగులకు పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. కులగణన, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. జిల్లాలో 40,074 కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేశామన్నారు.

ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

చిన్నారెడ్డి

పోడుభూముల కోసం సౌరగిరి జలవికాసం..

జిల్లాలో అత్యధికంగా ఉన్న పోడు భూముల్లో సౌర విద్యుత్‌ సౌకర్యం కోసం ఇందిరా సౌరగిరి జలవికాసం పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా 2,918 మంది రైతులకు అటవీ హక్కుల చట్టం కింద భూ యాజమాన్యపు హక్కులను కల్పించినట్టు వివరించారు. విద్యుత్‌ సదుపాయం లేని గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీతో 7.5 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న సోలార్‌ విద్యుత్‌ పంపులను ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు.

రుద్రమదేవి

వేషధారణలో విద్యార్థిని

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..

రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఉద్యమస్ఫూర్తిని ప్రతిబింభించే నృత్య ప్రదర్శనలతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులను ఎంపీ మల్లు రవి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అభినందించి ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందజేశారు.

తెలంగాణ తల్లి

వేషధారణలో విద్యార్థిని

ప్రజా ప్రభుత్వంలో అందరికీ సామాజిక న్యాయం

రైతులు, పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం

రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement