కందనూలు: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాల్లో తెలుగు పరీక్ష నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 1,065 మందికి గాను 965 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 909 మందికి గాను 828 మంది, ఒకేషనల్ విభాగంలో 156 మందికి గాను 137 మంది హాజరై పరీక్ష రాశారు. అదే విధంగా మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 266 మందికి గాను 241 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 223 మందికి గాను 204 మంది, ఒకేషనల్ విభాగంలో 43 మందికి గాను 37 మంది హాజరై పరీక్ష రాశారు. మొదటి సంవత్సరంలో 100 మంది, ద్వితీయ సంవత్సరంలో 25 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.


